భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అండర్–19 మహిళల టీ20 ట్రోఫీ ఎలైట్ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు రన్నరప్‌గా నిలిచింది. కోల్‌కతా వేదికగా బుధవారం జరిగిన ఫైనల్లో ఆంధ్ర జట్టు ఏడు వికెట్ల తేడాతో కర్ణాటక (Karnataka vs Andhra) జట్టు చేతిలో ఓడిపోయింది. మొహమ్మద్ మెహక్ సారథ్యంలోని ఆంధ్ర జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు సాధించింది.
ధాటిగా ఆడిన దీక్ష.. కానీ
ఆంధ్ర ఓపెనర్ కాట్రగడ్డ దీక్ష (21 బంతుల్లో 36; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడింది. సేతు సాయి (46 బంతుల్లో 45; 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. గ్రీష్మ సైనీ (12 బంతుల్లో 11; 2 ఫోర్లు), అంజుమ్ (22 బంతుల్లో 14; 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ఈ నలుగురు మినహా మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు.
కర్ణాటక బౌలర్లలో జె.దీక్ష 21 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... వందిత రావు, వేద వర్షిణి 2 వికెట్ల చొప్పున తీశారు. అనంతరం 120 పరుగుల లక్ష్యాన్ని కర్ణాటక 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకొని చాంపియన్‌గా అవతరించింది.
ఒకదశలో 55 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన కర్ణాటక జట్టును సీడీ దీక్ష (39 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), కాష్వీ కందికుప్ప (20 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు) విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు అజేయంగా 65 పరుగులు జోడించారు.
రెండో స్థానంలో నిలిచి
ఆంధ్ర బౌలర్లలో తమన్నా, బీఎస్ దీప్తి, అంజుమ్ ఒక్కో వికెట్ తీశారు. మొత్తం 30 జట్లు పాల్గొన్న ఈ టోరీ్నలో గ్రూప్ ‘ఎ’లో ఉన్న ఆంధ్ర జట్టు లీగ్ మ్యాచ్‌లు ముగిశాక రెండో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర 27 పరుగుల తేడాతో రాజస్తాన్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
గుజరాత్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర ఐదు వికెట్ల తేడాతో నెగ్గి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. బెంగాల్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆంధ్ర ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్ పోరుకు చేరుకుంది.
చదవండి: హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం


