
PC: BCCI
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శనివారం కీలక నియామకం చేపట్టింది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ సునిల్ జోషి (Sunil Joshi)ని నియమించింది. సాయి రాజ్ బహుతులే స్థానంలో అతడు ఈ మేరకు బాధ్యతలు చేపట్టనున్నాడు.
ఆటకు స్వస్తి చెప్పిన తర్వాత
కాగా కర్ణాటకకు చెందిన సునిల్ జోషి స్పిన్ ఆల్‌రౌండర్. టీమిండియా తరఫున 15 టెస్టుల్లో 41 వికెట్లు తీయడంతో పాటు.. 352 పరుగులు చేశాడు. అదే విధంగా.. 69 వన్డేల్లో 69 వికెట్లు తీసి 584 పరుగులు సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 5129 పరుగులు కూడా సునిల్ జోషి ఖాతాలో ఉన్నాయి.
ఆటకు స్వస్తి చెప్పిన తర్వాత కోచ్ అవతారమెత్తిన సునిల్ జోషి దేశీ క్రికెట్‌లో అస్సాం, జమ్మూ కశ్మీర్, హైదరాబాద్ జట్లకు మార్గనిర్దేశనం చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్, అమెరికా, ఒమన్ జట్లకు కోచ్‌గా సేవలు అందించాడు.
ఇక ఐపీఎల్‌లో 2023 నుంచి 2025 వరకు పంజాబ్ కింగ్స్ జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గానూ సునిల్ జోషి పనిచేశాడు. తాజా నియామకంతో పంజాబ్ ఫ్రాంఛైజీతో అతడికి ఉన్న అనుబంధం తెగిపోయినట్లయింది. వచ్చే సీజన్‌లో పంజాబ్ వేరే కోచ్‌ను వెతుక్కోవాల్సి ఉంటుంది.
కాగా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత్-‘ఎ’ జట్టు ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సునిల్ జోషి భారత జట్టుతోనే ఉన్నాడు.
ఆణిముత్యాలను వెలికి తీసేందుకు
భారత పురుషుల, మహిళల క్రికెట్‌లోని అన్ని ఏజ్ గ్రూపుల ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్దే ఉద్దేశంతో బీసీసీఐ.. సునిల్ జోషిని రంగంలోకి దించింది. రాకేశ్ ధ్రువ్, నూషిన్ ఆల్ ఖదీర్ వంటి వారి పేర్లు పరిశీలనలోకి వచ్చినా.. సునిల్‌కే ఓటు వేసింది.
ఇక CoE హెడ్, సహచర మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌తో కలిసి సునిల్ పనిచేయనున్నాడు. యువ, వర్ధమాన స్పిన్నర్లకు శిక్షణ ఇవ్వనున్నాడు. అంతేకాదు.. టీమిండియా జట్టులో భాగమైన ఆటగాళ్లకు కూడా అవసరమైన సమయంలో CoEలో మెళకువలు నేర్పించేందుకు సిద్ధమయ్యాడు.
కాగా టీమిండియా ప్రస్తుతం ఆసియా టీ20 కప్-2025 టోర్నీతో బిజీగా ఉంది. దుబాయ్‌లో ఆదివారం జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌తో తలపడనుంది. అనంతరం స్వదేశంలో అక్టోబరు 2 నుంచి వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో అక్టోబరు 1న సునిల్ జోషి తన బాధ్యతలు చేపట్టనుండటం గమనార్హం.
చదవండి: IND vs WI: ‘అతడి తండ్రి గట్టిగానే నిలదీశాడు.. అందుకే ఆ ప్లేయర్‌పై వేటు’