
టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (పాత ఫొటో)
టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్
ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్ ముగిసిన తర్వాత బారత క్రికెట్ జట్టు టెస్టులతో బిజీ కానుంది. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో సిరీస్ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్‌లో భాగంగా విండీస్ జట్టుతో టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది.
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గురువారమే ఇందుకు సంబంధించిన జట్టును ప్రకటించింది. శుబ్‌మన్ గిల్ సారథ్యంలో.. రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు తెలిపింది.
ఓపెనర్ల కోటాలో వారే
బీసీసీఐ ప్రకటించిన పదిహేను మంది సభ్యుల జట్టులో ఓపెనర్ల కోటాలో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal), కేఎల్ రాహుల్ తమ స్థానాల్ని పదిలం చేసుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో సాయి సుదర్శన్ (Sai Sudharsan), దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేయనున్నారు. వీరంతా దాదాపు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నవాళ్లే.

అతడిపై వేటు
అయితే, ఇంగ్లండ్ టూర్‌కు రిజర్వు ఓపెనర్‌గా సెలక్ట్ చేసిన అభిమన్యు ఈశ్వరన్‌పై మాత్రం సెలక్టర్లు ఈసారి వేటు వేశారు. దీంతో ఈ ఓపెనింగ్ బ్యాటర్ టీమిండియా అరంగేట్రం కల మరోసారి వాయిదా పడింది. కాగా దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్ తరఫున పరుగుల వరద పారించిన అభిమన్యు ఈశ్వరన్.. 2022లో తొలిసారి భారత టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు.
అభిమన్యు తొలిసారి టీమిండియా పిలుపు అందుకున్న తర్వాత.. దాదాపు పదిహేను మంది అరంగేట్రం చేశారు. కానీ అతడు మాత్రం ఇంతవరకు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టలేకపోయాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనల్లో భాగంగా టెస్టు సిరీస్‌కు ఎంపికైనప్పటికీ తుదిజట్టులో మాత్రం మేనేజ్‌మెంట్ అతడిని ఆడించలేదు.
బీసీసీఐపై తండ్రి విమర్శలు
ఈ నేపథ్యంలో అభిమన్యు ఈశ్వరన్ తండ్రి రంగనాథన్ ఈశ్వరన్ బీసీసీఐని బాహాటంగానే విమర్శించారు. ‘‘అభిమన్యు అరంగేట్రం కోసం సంవత్సరాలు లెక్కబెడుతున్నాం. మూడేళ్లుగా ఎదురుచూపులు తప్పడం లేదు.
అభిమన్యు సెలక్ట్ అయినపుడు జట్టులోనే లేని కరుణ్ నాయర్‌ను తిరిగి పిలిపించి ఇంగ్లండ్‌లో ఆడించారు. కానీ మావాడిని మాత్రం లెక్కచేయలేదు. సంప్రదాయ క్రికెట్‌లో రాణించిన వారిని పక్కనపెట్టి.. ఐపీఎల్‌లో ఆడిన వారికి పెద్దపీట వేస్తారా?’’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
అతడి తండ్రి గట్టిగా మాట్లాడాడు.. అందుకే ఆ ప్లేయర్‌పై వేటు
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తాజాగా స్పందించాడు. వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌కు అభిమన్యును ఎంపిక చేయకపోవడాన్ని విమర్శిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘అభిమన్యు ఈశ్వరన్ విషయంలో బాధగా ఉంది. నాకు తెలిసి.. ఇంగ్లండ్ పర్యటన తర్వాత అభిమన్యు తండ్రి ఘాటుగానే బీసీసీఐ తీరును విమర్శించారు. బహుశా అందుకే సెలక్టర్లు అతడిని తప్పించి ఉంటారు.
అయితే, చీఫ్ సెలక్టర్ మాత్రం.. సొంతగడ్డపై టెస్టుల్లో రిజర్వ్ ఓపెనర్ అవసరం ఉండదని.. అందుకే ఇలా చేసినట్లు తెలిపాడు. ఇది కూడా కొంత వరకు సమంజసమే’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు. అదే విధంగా.. ఇంగ్లండ్ పర్యటనలో వరుస అవకాశాలు ఇచ్చినా విఫలమైనా కరుణ్ నాయర్‌పై వేటు వేయడాన్ని చిక్కా సమర్థించాడు.
చదవండి: IND vs WI: అందుకే సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయలేదు: అజిత్ అగార్కర్