
టీమిండియా అరంగేట్రం కోసం మూడేళ్లుగా ఎదురుచూన్నాడు అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran). దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన ఈ బెంగాల్ బ్యాటర్‌కు 2022లోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలక్టర్లు పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా నాటి కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) గాయపడటంతో.. అభిమన్యుతో అతడి స్థానాన్ని భర్తీ చేశారు.
మరోసారి పాత కథే పునరావృతం
అయితే, ఆ సిరీస్‌లో అభిమన్యుకు ఆడే అవకాశం రాలేదు. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడే టీమిండియాకు కూడా ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఎంపికయ్యాడు. అప్పుడూ తుదిజట్టులో నో ఛాన్స్. ఇక తాజాగా ఇంగ్లండ్‌తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సిరీస్ ఆడే జట్టులోనూ స్థానం సంపాదించాడు.
కానీ.. మరోసారి పాత కథే పునరావృతం అయింది. అభిమన్యు ఈశ్వరన్ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అయితే, ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పునరాగమనం చేసిన కరుణ్ నాయర్‌కు మాత్రం మేనేజ్‌మెంట్ వరుస అవకాశాలు ఇచ్చింది. ఇంగ్లండ్‌తో తొలి మూడు టెస్టుల్లో విఫలమైనా.. ఐదో టెస్టులో అతడికి మరోసారి ఆడే ఛాన్స్ ఇచ్చింది.
జట్టులో లేని ప్లేయర్‌కు ఛాన్సులు
ఈ నేపథ్యంలో అభిమన్యు ఈశ్వరన్ తండ్రి రంగనాథన్ ఈశ్వరన్ బీసీసీఐ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘అభిమన్యు టెస్టు అరంగేట్రం కోసం నేను రోజులు కాదు.. సంవత్సరాలు లెక్కబెడుతున్నాను. ఇప్పటికి మూడేళ్ల కాలం గడిచింది.
ఓ బ్యాటర్‌గా పరుగులు చేయడం మాత్రమే కదా కావాల్సింది. ఆ పని అభిమన్యు చేస్తూనే ఉన్నాడు. నిజానికి అభిమన్యు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ జట్టుకు ఎంపికైనపుడు కరుణ్ నాయర్ అసలు జట్టులోనే లేడు.
ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా టెస్టులకు ఎంపికా?
కానీ ఐపీఎల్‌లో కాస్త మెరుగ్గా ఆడితే టెస్టు టీమ్‌లోకి తీసుకుంటారు. అసలు సంప్రదాయ క్రికెట్ జట్టుకు ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ప్లేయర్లను ఎంపిక చేయడం ఏమిటి? రంజీ ట్రోఫీ, దులిప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల్లో ప్రదర్శన మాత్రమే టెస్టు సెలక్షన్‌కు ప్రామాణికం కదా!
ఏడాది కాలంలో నా కుమారుడు 864 పరుగులు సాధించాడు. అయినా తనకు ఆడే అవకాశం రావడం లేదు. నా కుమారుడు డిప్రెషన్‌లో కూరుకుపోయినట్లు అనిపిస్తోంది’’ అంటూ రంగనాథన్ ఆవేదన వ్యక్తం చేశారు. సెలక్టర్ల తీరు సరికాదంటూ మండిపడ్డారు.
నిజానికి అభిమన్యు ఈశ్వరన్ తొలిసారి టెస్టు జట్టు నుంచి పిలుపు అందుకున్న నాటి నుంచి నేటి వరకు ఏకంగా 15 మంది క్రికెటర్లు అరంగేట్రం చేయడం గమనార్హం. కాగా 29 ఏళ్ల అభిమన్యు ఇప్పటికి 103 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 27 శతకాలు, 31 అర్ధ శతకాల సాయంతో 7841 పరుగులు సాధించాడు.
చదవండి: మొన్నటి వరకు జట్టులో దండగ అన్నారు.. ఇప్పుడు అతడే దిక్కయ్యాడు