
జాతీయ జట్టు తరఫున ఆడాలని ప్రతి ఒక్క ఆటగాడు కోరుకుంటాడు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం వస్తే అంతకంటే గొప్పదేమీ లేదంటూ గర్వపడతాడు. అయితే, క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran)కు మాత్రం ఇప్పట్లో ఈ కల నెరవేరేలా కనిపించడం లేదు.
961 రోజులుగా నిరీక్షణ
టీమిండియాకు ఆడాలన్న అభిమన్యు ఆశయానికి వరుసగా బ్రేకులు పడుతూనే ఉన్నాయి. తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికైన నాటి నుంచి ఇప్పటికి 961 రోజులుగా అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అరంగేట్రం చేసేందుకు కళ్లు కాయేలా ఎదురుచూస్తున్నాడు. కానీ మేనేజ్‌మెంట్ ఇంత వరకు కనికరించనేలేదు.
పదిహేను మంది ఆటగాళ్ల అరంగేట్రం
తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లోనూ ఒక్క మ్యాచ్‌లో కూడా అభిమన్యును ఆడించలేదు. అయితే, అభిమన్యు టెస్టుల కోసం సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్న తర్వాత.. పదిహేను మంది ఆటగాళ్లు అతడి కంటే ముందే అరంగేట్రం చేయడం గమనార్హం.
బంగ్లాదేశ్‌తో 2022 నాటి టెస్టు సిరీస్ సందర్భంగా రోహిత్ శర్మ గాయపడటంతో.. అతడి స్థానంలో అభిమన్యుకు సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. కానీ తుదిజట్టులో స్థానం కల్పించలేదు. ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి కూడా ఎంపికైనప్పటికీ ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఆడే ఛాన్స్ దక్కలేదు.
ఆ లిస్టు ఇదే
అయితే, కేఎస్ భరత్ (2023), సూర్యకుమార్ యాదవ్ (2023), యశస్వి జైస్వాల్ (2023), ఇషాన్ కిషన్ (2023), ముకేశ్ కుమార్ (2023), ప్రసిద్ కృష్ణ (2023), రజత్ పాటిదార్ (2024), సర్ఫరాజ్ ఖాన్ (2024), ధ్రువ్ జురెల్ (2024), ఆకాశ్ దీప్ (2024), దేవ్‌దత్ పడిక్కల్ (2024), నితీశ్ కుమార్ రెడ్డి (2024), హర్షిత్ రాణా (2024), సాయి సుదర్శన్ (2025), అన్షుల్ కంబోజ్ (2025)లు మాత్రం ఇప్పటికే టెస్టుల్లో అరంగేట్రం చేశారు.
అందుకే నో ఛాన్స్!
వీరిలో యశస్వి జైస్వాల్ టెస్టు జట్టు ఓపెనర్‌గా పాతుకుపోగా.. రోహిత్ శర్మ రిటైరైన తర్వాత అతడి స్థానాన్ని కేఎల్ రాహుల్ భర్తీ చేశాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటన నాటి నుంచే జైస్వాల్- రాహుల్ ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్నారు. దీంతో ఓపెనింగ్ బ్యాటర్ అయిన అభిమన్యుకు నిరాశ తప్పడం లేదు.
కాగా దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అభిమన్యు ఈశ్వరన్ ఇప్పటి వరకు 103 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 27 శతకాలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 7841 పరుగులు సాధించాడు. చివరగా ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌తో అనధికారిక టెస్టులో భారత్-ఎ తరఫున బరిలోకి దిగి 11, 80 పరుగులు సాధించాడు.
అభిమన్యుతో పాటు వీరిద్దరు కూడా
కాగా ఇంగ్లండ్‌తో టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడుతున్న టీమిండియా 1-2తో వెనుకబడి ఉంది. లండన్‌లోని ఓవల్ మైదానంలో గురువారం మొదలైన ఐదో టెస్టులో గెలిస్తేనే సిరీస్‌ను 2-2తో సమం చేయగలుగుతుంది.
ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌లో అభిమన్యుతో పాటు పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు కూడా అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. మరోవైపు.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఇంగ్లండ్ పర్యటనను ముగించనున్నాడు.
చదవండి: Jacob Bethell: ఐదో టెస్టులో కొత్త సూపర్‌స్టార్‌ని చూస్తాం: అశ్విన్