టీమిండియా సీనియర్ క్రికెటర్ కేఎల్ రాహుల్ రిటైర్మెంట్‌పై తొలిసారి నోరు విప్పాడు. గతంలో చాలాసార్లు ఆటకు వీడ్కోలు పలకాలనే ఆలోచన వచ్చిందని.. తన విషయంలో రిటైర్మెంట్ కష్టతరంగా ఉండబోదని వ్యాఖ్యానించాడు. కర్ణాటకకు చెందిన కేఎల్ రాహుల్.. 2014లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
ఇప్పటి వరకు 67 టెస్టులు, 94 వన్డేలు, 72 టీ20 మ్యాచ్‌లు ఆడిన కేఎల్ రాహుల్.. టెస్టుల్లో 4053, వన్డేల్లో 3360, టీ20లలో 2265 పరుగులు సాధించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో టెస్టుల్లో 11 సెంచరీలు, వన్డేల్లో 8 శతకాలు, టీ20లలో రెండు సెంచరీలు ఉన్నాయి.
వికెట్ కీపర్‌గానూ
టీమిండియా తరఫున ప్రస్తుతం టెస్టు, వన్డే జట్లలో కీలకంగా ఉన్న 33 ఏళ్ల కేఎల్ రాహుల్ (KL Rahul).. యాభై ఓవర్ల ఫార్మాట్లో వికెట్ కీపర్‌గానూ సేవలు అందిస్తున్నాడు. అయితే, గతంలో ఈ మంగళూరు ప్లేయర్ చాలాసార్లు గాయాల బారిన పడ్డాడు. అదే విధంగా.. నిలకడలేమి ఆట తీరు కారణంగా ఓపెనర్‌గా ఉన్న అతడు మిడిలార్డర్‌కు డిమోట్ అయ్యాడు. మరికొన్నిసార్లు తిరిగి ఓపెనర్‌గా వచ్చాడు.
మరుక్షణమే రిటైర్మెంట్ ప్రకటిస్తా
ప్రస్తుతానికి జట్టులో కేఎల్ రాహుల్ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీలేదు. అయితే, తన అవసరం టీమ్‌కు లేదని భావించిన మరుక్షణమే రిటైర్మెంట్ ప్రకటిస్తానంటూ తాజాగా అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌తో ముచ్చటిస్తూ..
‘‘రిటైర్మెంట్ (Retirement) గురించి నేనెప్పుడో ఆలోచించాను. నా విషయంలో ఇది మరీ అంత కష్టంగా ఉండబోదు. మన పట్ల నిజాయితీగా ఉంటే.. రిటైర్మెంట్‌కు సరైన సమయం ఏమిటో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని పెద్దగా నాన్చాల్సిన పని ఉండదు.
ఇంకాస్త సమయం ఉంది
నేనైతే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటా. ప్రస్తుతానికి నా రిటైర్మెంట్‌కు ఇంకాస్త సమయం ఉంది. అయితే, ఆటను వదిలేయాలని అనిపించినపుడు ఆ దిశగా నిర్ణయం తీసుకోవడమే మంచిది.
క్రికెట్ ఒక్కటే జీవితం కాదు. మనకంటూ ఓ కుటుంబం ఉంటుంది. నాకు కూతురు పుట్టిన తర్వాత ఒక్కసారిగా నా దృష్టి కోణం మారిపోయింది. జీవితంలో మరెన్నో ముఖ్య విషయాలు ఉంటాయి. ఏదేమైనా ఆటకు నా అవసరం లేదని అనిపించిన మరుక్షణం నేను తప్పుకొంటా.
నేను లేకపోయినా దేశంలో, ప్రపంచంలో క్రికెట్ కొనసాగుతూనే ఉంటుంది. గతంలో నేను చాలాసార్లు గాయపడ్డాను అప్పుడు మనతో మనం పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది. ఫిజియో, సర్జన్ల వల్ల మన శరీరానికి నొప్పి కలగవచ్చు.
మానసిక స్థితి బలహీనపడుతుంది
అయితే, ఆ సమయంలో మన మానసిక స్థితి బలహీనపడిపోతుంది. ఇంకెన్నాళ్లు ఇలా.. ఇక చాలు అని మెదడు చెబుతుంది. అదృష్టవశాత్తూ క్రికెట్ వల్ల మనం ఎక్కువగా డబ్బు సంపాదించగలం. కాబట్టి ఆటను వదిలినా పెద్దగా నష్టమేమీ లేదు.. ఇంకొన్నాళ్లు జీవితం సాఫీగా సాగించవచ్చు అని సంకేతాలు ఇస్తుంది.
ఇలాంటి మానసిక స్థితిని అధిగమిస్తేనే మళ్లీ మనం మైదానంలోకి దిగగలము’’ అని కేఎల్ రాహుల్ తన మనసులోని భావాలను వెల్లడించాడు. కాగా ఇటీవల న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా కేఎల్ రాహుల్ చివరగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు.
చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్!
An Incredibly Honest KL Rahul On Retirement 💭 pic.twitter.com/8LJcxVLpnG
— The Switch | Kevin Pietersen (@kptheswitch) January 26, 2026


