
భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య ఐదో టెస్టు నేపథ్యంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ ప్రపంచం ఓ కొత్త సూపర్‌స్టార్‌ను చూడబోతుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ యువ ఆటగాడు జేకబ్ బేతెల్ ఓవల్ టెస్టులో సత్తా చాటి.. నయా సూపర్‌స్టార్‌గా అవతరించబోతున్నాడని జోస్యం చెప్పాడు.
ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy) సిరీస్ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు నాలుగు టెస్టులు పూర్తి కాగా ఇంగ్లండ్ ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగే ఆఖరిదైన ఐదో టెస్టుతో ఫలితం తేలనుంది.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తుదిజట్టులో నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ భుజం నొప్పి కారణంగా ఐదో టెస్టుకు దూరం కాగా.. అతడి స్థానంలో ఓలీ పోప్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అదే విధంగా.. జేమీ ఓవర్టన్ జట్టులోకి వచ్చాడు.
అసాధారణ ప్రతిభ
మరోవైపు.. జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, లియామ్ డాసన్ స్థానాల్లో జేకబ్ బెతెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్‌లకు తుదిజట్టులో స్థానం దక్కింది. ఈ నేపథ్యంలో అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘ఐదో టెస్టు సందర్భంగా క్రికెట్ ప్రపంచం కొత్త సూపర్‌స్టార్‌ను చూడబోతోంది.
అతడు కచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. అవును.. జేకబ్ బెతెల్ గురించే నేను మాట్లాడుతున్నాను. అతడిలో అసాధారణ ప్రతిభ దాగి ఉంది. బ్యాట్‌తో అద్భుతాలు చేయగలడు. లెఫ్టార్మ్ బౌలింగ్‌తో అదనపు బౌలర్‌గానూ పనికివస్తాడు’’ అని ప్రశంసలు కురిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
టీమిండియాలోనూ నాలుగు మార్పులు
ఇదిలా ఉంటే.. ఐదో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కూడా నాలుగు మార్పులు చేసింది. జస్‌ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, రిషభ్ పంత్, అన్షుల్ కంబోజ్ స్థానాల్లో ఆకాశ దీప్, ప్రసిద్ కృష్ణ, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ తుదిజట్టులోకి వచ్చారు.
కాగా 21 ఏళ్ల జేకబ్ బెతెల్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన అతడు.. లెఫ్టార్మ్ స్పిన్నర్‌గానూ సేవలు అందించగలడు.
గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన జేకబ్.. ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున 12 వన్డేలు, 13 టీ20లు, మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 317, 281, 260 పరుగులు చేశాడు. అదే విధంగా.. వన్డేల్లో ఏడు, టీ20లలో నాలుగు, టెస్టుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: ‘మీకు మరో దారి లేదు’.. షాహిద్ ఆఫ్రిది ఓవరాక్షన్.. దిమ్మతిరిగిపోయింది!