వడోదర వేదికగా టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ పోరాడి ఓడిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆతిథ్య జట్టుకు కివీస్ గట్టి పోటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టుపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సీనియర్లు లేనప్పటికి పర్యాటక జట్టు పోరాట పటిమను అశ్విన్ కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకురేందుకు కివీస్ బౌలర్లు ఆఖరి వరకు శ్రమించారు. కానీ దురదృష్టవశాత్తు 4 వికెట్ల తేడాతో బ్లాక్‌క్యాప్స్ జట్టు ఓటమి పాలైంది.
"చాలా అగ్రశ్రేణి జట్లు డేటా లేదా అనలిటిక్స్ మీద ఆధారపడవు. కానీ న్యూజిలాండ్ మాత్రం అందుకు భిన్నం. ప్రత్యర్ధి జట్టుకు సంబంధించి ప్రతీ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. వ్యూహాలు రచించడం, వాటిని విజయవంతంగా అమలు చేయడంలో కివీస్ దిట్ట. బ్లాక్ క్యాప్స్ తమ ప్రణాళికలను ఎలా అమలు చేస్తారో తెలుసుకోవడానికి, వారి టీమ్ మీటింగ్‌లలో పాల్గోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
అవసరమైతే దానికోసం డబ్బులు చెల్లించడానికైనా నాకు అభ్యంతరం లేదు" అని అశ్విన్ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్‌కు కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, రచిన్ రవీంద్ర, మాట్ హెన్రీ, శాంట్నర్ వంటి కివీ స్టార్ ప్లేయర్లు దూరమయ్యారు. దీంతో బ్లాక్ క్యాప్స్ జట్టు కెప్టెన్‌గా మైఖల్ బ్రెస్‌వేల్ వ్యవహరిస్తున్నాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం రాజ్‌కోట్ వేదికగా జరగనుంది.
చదవండి: IND vs NZ: చరిత్రకు అడుగు దూరంలో శ్రేయస్ అయ్యర్


