టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన రీఎంట్రీలో సత్తాచాటిన సంగతి తెలిసిందే. వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లో 49 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇప్పుడు రాజ్‌కోట్ వేదికగా జరగనున్న రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించాలని ఈ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఉవ్విళ్లురుతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు అయ్యర్‌కు ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. శ్రేయస్ తన వన్డే కెరీర్‌లో 3000 పరుగుల మార్కును చేరుకోవడానికి కేవలం 34 పరుగుల దూరంలో ఉన్నాడు.
రాజ్‌కోట్ వన్డేలో శ్రేయస్ మరో 34 పరుగులు చేస్తే.. అత్యంతవేగంగా(ఇన్నింగ్స్‌లు పరంగా) ఈ ఫీట్ అందుకున్న భారత ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఈ ముంబైకర్ ఇప్పటివరకు 68 వన్డే ఇన్నింగ్స్‌లలో 2966 పరుగులు చేశాడు.
ప్రస్తుతం ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్(72 ఇన్నింగ్స్‌లు) తొలి స్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్ధానాల్లో విరాట్ కోహ్లి(75), కేఎల్ రాహుల్(78) ఉన్నారు. ఇప్పుడు వీరిందరిని అధిగమించేందుకు సర్పంచ్ సాబ్ సిద్దమయ్యాడు.
శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం భారత వన్డే జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా నాలుగో స్ధానంలో అయ్యర్‌ను మించిన ఆటగాడు కన్పించడం లేదు. 2017 నుండి 2021 మధ్య కాలంలో టీమిండియా మెనెజ్‌మెంట్ దాదాపు నాలుగవ స్దానం కోసం దాదాపు 13 మంది ఆటగాళ్లను మార్చింది. ఒక్కరు కూడా 500 పరుగుల మార్కును కూడా దాటలేదు. కానీ అయ్యర్ మాత్రం ఆ లోటును భర్తీ చేశాడు. ఈ స్ధానంలో అయ్యర్ 54.77 సగటుతో 1479 పరుగులు సాధించాడు.
చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ క్రికెట్ దిగ్గజం


