
పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi)కి ఇండియా చాంపియన్స్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ‘ఏ ముఖం పెట్టుకుని వస్తారో చూడాలని ఉంది’ అంటూ అతడు చేసిన ‘అతి’ వ్యాఖ్యలకు.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో ఆడకపోవడమే ఉత్తమం అంటూ వాకౌట్ ద్వారా సమాధానం ఇచ్చింది.
కాగా ‘వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్’ (WCL) టోర్నమెంట్‌లో ఇండియా చాంపియన్స్ సెమీస్ చేరిన విషయం తెలిసిందే. అయితే, సెమీ ఫైనల్ పోరులో దాయాది పాకిస్తాన్‌తో భారత్ తలపడాల్సి వచ్చింది. అయితే, టీమిండియా ఇందుకు నిరాకరించింది.
లీగ్ దశలోనూ
లీగ్ దశలోనూ పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన భారత స్టార్లు... దాయాదితో మైదానంలో తలపడేది లేదని మరోసారి తేల్చిచెప్పారు. జమ్మూ కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడబోమని... భారత చాంపియన్స్ జట్టు ప్లేయర్లు శిఖర్ ధావన్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా (Suresh Raina) స్పష్టం చేశారు.
ఇక లీగ్ దశలో పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన భారత్... మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో గెలిచి మూడింట ఓడి 3 పాయింట్లు దక్కించుకుంది. అయితే చివరి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారీ విజయం నమోదు చేసుకున్న భారత్... మెరుగైన రన్‌రేట్‌తో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పాకిస్తాన్‌తో గురువారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనున్న తొలి సెమీఫైనల్లో భారత్ తలపడాల్సి ఉండగా... మన ప్లేయర్లు ఈ మ్యాచ్‌ను సైతం బహిష్కరించారు.
వాళ్లకు మరోదారి లేదు.. అస్సలు ఆడము
అయితే, ఈ సెమీ ఫైనల్ కంటే ముందు మీడియాతో మాట్లాడుతూ షాహిద్ ఆఫ్రిది ఓవరాక్షన్ చేశాడు. ‘‘భారత జట్టు ఏ ముఖం పెట్టుకుని మాతో ఆడుతుందో చూడాలని ఉంది. మాతో ఆడటం తప్ప వాళ్లకు ఇప్పుడు మరోదారి లేదు’’ అంటూ వ్యాఖ్యానించాడు. కానీ దేశమే తమకు ముఖ్యమంటూ భారత క్రికెటర్లు పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించారు.
అయితే, భారత జట్టు నిర్ణయంతో పాక్ ఫైనల్‌కు చేరింది. మరోవైపు.. యువీ సేన టోర్నీ నుంచి నిష్క్రమించినా.. దేశ ప్రజల కోసం సరైన పనే చేశామనే సంతోషంతో వెనుదిరిగింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో క్రీడల్లోనూ బంధం కొనసాగించడం సరికాదనే అభిప్రాయంతో డిఫెండింగ్ చాంపియన్ స్వయంగా సెమీస్ పోరు నుంచి బయటకు వచ్చింది.
నాడు ఆఫ్రిదికి ధావన్ కౌంటర్
కాగా షాహిద్ ఆఫ్రిదికి నోటి దురుసు ఎక్కువేనన్న విషయం తెలిసిందే. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా భారత సైన్యం ‘ఆపరేషర్ సిందూర్’ పేరిట.. ముష్కరులను మట్టుపెడితే షాహిద్ ఆఫ్రిది బాధపడిపోయాడు. తప్పు మీదేనంటూ భారత ఆర్మీని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు.
ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ షాహిద్ ఆఫ్రిదిని ఉద్దేశించి.. ‘‘కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్‌ను మట్టికరిపించిన భారత సైన్యం గురించి మాట్లాడుతున్నారా? మీకు ఇంకా బుద్ధిరాలేదా? ఇలాంటి వ్యాఖ్యలు చేసే బదులు దేశ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి’’ అంటూ చురకలు అంటించాడు.
ఆరు జట్లు
ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో కూడిన ఆరుజట్లు ఇంగ్లండ్ వేదికగా డబ్ల్యూసీఎల్ పేరిట టీ20 టోర్నమెంట్ ఆడుతున్నాయి. 2024లో ఈ టోర్నీ మొదలుకాగా.. యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా చాంపియన్స్.. ఫైనల్లో పాకిస్తాన్ చాంపియన్స్‌ను ఓడించి టైటిల్ గెలిచింది.
కాగా భారత్, పాక్‌తో పాటు ఈ ఈవెంట్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ సీజన్‌లో భారత్- పాక్ మధ్య జరగాల్సిన తొలి సెమీ ఫైనల్ రద్దుకాగా.. రెండో సెమీస్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా గురువారం (జూలై 31) అమీతుమీ తేల్చుకుంటాయి.
చదవండి: AUS vs IND: ఆస్ట్రేలియా టూర్‌కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు