టీమిండియా అత్యుత్తమ క్రికెటర్లలో యువరాజ్ సింగ్ ఒకడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడు అందించిన సేవలు మరువలేనివి. టీ20 ప్రపంచకప్- 2007, 2011లో వన్డే వరల్డ్‌కప్ టైటిళ్లను భారత్ గెలవడంలో ఈ ఆల్‌రౌండర్‌ది కీలక పాత్ర.
ఇక 2007 ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి యువీ (Yuvraj Singh) తన పేరిట అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డే వరల్డ్‌కప్-2011లో 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు కూల్చి సత్తా చాటాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు అందుకున్నాడు.
క్యాన్సర్ బారిన పడి..
అయితే, యువీ జీవితం నల్లేరు మీద నడకేమీకాదు. చిన్ననాడు తండ్రి యోగ్‌రాజ్ సింగ్ శిక్షణలో ఎన్నో కష్టాలు అనుభవించిన యువీ.. ఆ తర్వాత తల్లిదండ్రులు విడిపోగా.. తల్లి సమక్షంలో ఉన్నాడు. అవరోధాలను అధిగమించి క్రికెటర్‌గా ఉన్నత శిఖరాలకు చేరిన వేళ క్యాన్సర్ మహమ్మారి బారినపడ్డాడు. వన్డే వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత అతడికి క్యాన్సర్ ఉన్నట్లు తేలింది.
పడిలేచిన కెరటం
ఛాతిలో నొప్పి, రక్తపు వాంతులు తదితర లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లిన యువీకి.. ఊపిరి తిత్తులు, గుండె మధ్య భాగంలో ట్యూమర్ ఉన్నట్లు నిర్దారణ అయింది. ఈ క్రమంలో అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకున్న యువరాజ్ సింగ్. కీమోథెరపీ చేయించుకున్నాడు. క్రమక్రమంగా కోలుకుని 2012 సెప్టెంబరులో క్రికెటర్‌గా రీఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత టీమిండియా తరఫున 2014, 2016 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొన్న యువీ.. 2017 చాంపియన్స్ ట్రోఫీలోనూ భాగమయ్యాడు. అయితే, వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడ్డ యువీ 2019లో అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తన కుమారుడిని అప్పటి కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి తొక్కేసారంటూ యోగ్‌రాజ్ సింగ్ గతంలో ఎన్నోసార్లు ఆరోపణలు చేశాడు.
తాజాగా తన రిటైర్మెంట్ గురించి స్పందిస్తూ యువరాజ్ సింగ్ సైతం పరోక్షంగా తండ్రి వ్యాఖ్యలకు మద్దతు పలికినట్లు సంకేతాలు ఇచ్చాడు. భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా యూట్యూబ్ షోలో మాట్లాడుతూ..
గౌరవం దక్కడం లేదనే భావన
‘‘కెరీర్ భారంగా మారిపోయింది. నా ఆటను ఆస్వాదించలేకపోతున్నాని అప్పుడు స్పష్టంగా తెలిసింది. నా ఆటకు.. రిటైర్మెంట్‌కు నడుమ సన్నని గీత. అసలు ఆటను ఆస్వాదించలేనపుడు ఆడటం ఎందుకన్న ప్రశ్న.
నాకెవరూ మద్దతుగా లేరనిపించింది. నాకు గౌరవం దక్కడం లేదనే భావన కలిగింది. నాలో సత్తా లేకున్నా ఆడటం ఎందుకనే ప్రశ్న తలెత్తింది. ఆట నాకెంతో ఇచ్చింది. అందుకు ప్రతిగా నేనూ అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చాను.
ఇంకా నేనేమీ నిరూపించుకోవాలి?
మరి అలాంటి ఆటను నేనెందుకు ఆస్వాదించలేకపోతున్నానని బాధగా అనిపించింది. నేను ఆడాల్సిన అవసరం ఇక లేదనిపించింది. ఇంకా నేనేమీ నిరూపించుకోవాలి? శారీరకంగా, మానసికంగా ఇంతకంటే నేను ఏమీ చేయలేను. ఏదో తెలియని బాధ. కాబట్టి ఆటను ఇక ఆపివేయాలనే నిర్ణయానికి వచ్చాను.
ఎప్పుడైతే ఇక ఆడకూడదని నిర్ణయించుకున్నానో.. అప్పుడే మళ్లీ నన్ను నేను.. అసలైన నన్ను చేరుకోగలిగాను’’ అంటూ తాను పడిన మానసిక వేదన, ఒత్తిడిని గుర్తు చేసుకుంటూ యువీ ఒకింత ఉద్వేగానికి లోనయ్యాడు.


