టీ20 ప్రపంచకప్-2026లో పాకిస్తాన్ పాల్గొనడంపై ఇంకా సందిగ్థత కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించినప్పటికి.. శ్రీలంకకు వెళ్లేందుకు ఇంకా ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తోంది. ఈ విషయాన్ని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీని తెలిపాడు. అయితే పాకిస్తాన్ తమకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకుని అనవసర రచ్చ చేస్తుంది.
వివాదం ఎక్కడ మొదలైదంటే?
ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను తప్పించడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వరల్డ్‌కప్ కోసం తమ జట్టును భారత్‌కు పంపించేందుకు నిరాకరించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని బీసీబీ కోరింది. కానీ బీసీబీ విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది.
భద్రత పరంగా పూర్తి స్ధాయి హామీ ఇచ్చినప్పటికి బీసీబీ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ఐసీసీ వరల్డ్‌కప్ నుంచి బంగ్లాను తప్పించి వారి స్దానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ, బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్థాన్ కూడా టోర్నీ నుంచి తప్పుకుంటామని పరోక్షంగా హెచ్చరించింది. పాక్ వరల్డ్‌కప్‌లో పాల్గోనడంపై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
పాక్ బాయ్‌కట్ చేస్తే?
పాకిస్తాన్ గనుక ఈ మెగా టోర్నీని బహిష్కరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది. వరల్డ్ క్రికెట్‌లో పాకిస్తాన్-భారత్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురుంచి తెలిసిందే. ఈ క్రమంలో పాక్-భారత్ మ్యాచ్ రద్దు అయితే బ్రాడ్‌కాస్టర్లు.. స్పాన్సర్ల నుంచి వచ్చే ప్రకటనల ఆదాయాన్ని(సుమారు రూ. 318) కోల్పోవాల్సి ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే ఆ నష్టానికి పాక్ క్రికెట్ బోర్డు నుంచే వసూలు చేస్తామని ఐసీసీ ఇప్పటికే హెచ్చరించింది.
👉అదేవిధంగా టోర్నీలో పాల్గొన్నందుకు ఇచ్చే 250,000 డాలర్లు(రూ. 2 కోట్లు పైమాటే) పార్టిసిపేషన్ ఫీజును పీసీబీ కోల్పోవాల్సి ఉంటుంది.
👉పాక్ సెమీఫైనల్ చేరితే 790,000 డాలర్లు(సుమారు రూ. 7 కోట్లు), రన్నరప్ అయితే 1.6 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.15 కోట్లు), ఒకవేళ విజేతగా నిలిస్తే 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 25 కోట్లు) కోల్పోతారు
👉అంతేకాకుండా ఐసీసీ ప్రతీ ఏటా తమ సభ్యదేశాలకు ఇచ్చే రెవెన్యూ వాటాను కూడా నిలిపివేసే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే పాక్ క్రికెట్ బోర్డు దివాళా తీయాల్సిందే. ఫైనల్‌గా పాకిస్తాన్ తమ ప్రదర్శన బట్టి 250,000 డాలర్లు(సుమారు రూ.2.29 కోట్లు) నుంచి 4.42 మిలియన్ల డాలర్లు(సుమారు రూ. 38 కోట్లు) ప్రైజ్ మనీని కోల్పోయే ప్రమాదం ఉంది.


