
వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కరుణ్ నాయర్ (Karun Nair)కు టీమిండియా యాజమాన్యం మరో అవకాశం ఇచ్చింది. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు (Ind vs Eng) తుదిజట్టులో ఈ వెటరన్ బ్యాటర్‌కు స్థానం కల్పించింది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)- కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఈ దేశవాళీ క్రికెట్ వీరుడుపై మరోసారి నమ్మకం ఉంచడం నిజంగా విశేషమే.
ఈ మ్యాచ్‌కు ముందే కరుణ్ కెరీర్ ముగిసిపోయిందని అంతా భావించారు. త్వరలోనే అతడి నుంచి రిటైర్మెంట్ ప్రకటన వస్తుందనే ఊహాగానాలు జోరుగా వినిపించాయి. అయితే, అనూహ్యంగా మేనేజ్‌మెంట్ అతడికి మరోసారి పిలుపునివ్వడం పట్ల అభిమానులు సంతోషంగా ఉన్నారు.
ఇదే ఆఖరి అవకాశం
అయితే, అదే సమయంలో కరుణ్ నాయర్‌కు లభించిన చివరి అవకాశం ఇదేనని.. ఇక్కడా విఫలమైతే కెరీర్ ముగిసినట్లేననే కామెంట్లు చేస్తున్నారు. కాగా రంజీల్లో విదర్భ తరఫున సత్తా చాటిన కరుణ్‌కు.. ఎనిమిదేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేసే అవకాశం లభించింది.
ఇంగ్లండ్‌తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ సిరీస్ సందర్భంగా సెలక్టర్లు కరుణ్ నాయర్‌కు పిలుపునిచ్చారు. ఇంగ్లండ్ లయన్స్‌తో భారత్-ఎ తరఫున డబుల్ సెంచరీతో సత్తా చాటిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు.. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఆడే అవకాశం ఇచ్చారు.
చేసింది 131 పరుగులే
అయితే, కరుణ్ రీఎంట్రీలో డకౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు. ఆ తర్వాత కూడా అతడు స్థాయికి తగ్గట్లు రాణించలేదు. రెండో టెస్టు నుంచి వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కరుణ్ నాయర్.. ఇప్పటి వరకు చేసిన పరుగులు వరుసగా.. 0, 20, 31, 26, 40, 14.
ఇలా మూడు టెస్టుల్లో ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 33 ఏళ్ల కరుణ్ నాయర్.. 131 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయినా.. సరే ఆఖరి టెస్టులో అతడు మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రాగలిగాడు. కరుణ్‌ను చేర్చడం సహా ఐదో టెస్టులో టీమిండియా యాజమాన్యం తుదిజట్టులో నాలుగు మార్పులు చేసింది.
ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వగా.. గాయం వల్ల రిషభ్ పంత్ దూరమయ్యాడు. మరోవైపు.. శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్‌లపై మేనేజ్‌మెంట్ వేటు వేసింది. వీరి స్థానాల్లో ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ తుదిజట్టులోకి వచ్చారు.
ఒక్కమ్యాచ్ ఆడకుండానే కుల్దీప్, అర్ష్‌దీప్ ఇంటికి
ఇక చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మరోసారి మొండిచేయే ఎదురైంది. ఈ సిరీస్‌కు అతడిని ఎంపిక చేసినా.. ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు యాజమాన్యం. దీంతో ఒక్క టెస్టు ఆడకుండానే కుల్దీప్ ఇంగ్లండ్ పర్యటన ముగిసినట్లయింది.
మరోవైపు.. యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ది కూడా ఇదే కథ. టీ20, వన్డే ఫార్మాట్లలో టీమిండియా తరఫున సత్తా చాటుతున్న ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్‌బౌలర్‌కు ఇంతవరకు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం దక్కనే లేదు. ఇంగ్లండ్ పర్యటనలోనైనా ఆ కల నెరవేరుతుందనుకుంటే.. భంగపాటే ఎదురైంది.
ఆకాశ్ దీప్ పేరు మర్చిపోయిన గిల్
కాగా లండన్‌లోని ఓవల్ మైదానంలో ఐదో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, టీమిండియా కెప్టెన్ తమ తుదిజట్టు ప్రకటన సమయంలో ఆకాశ్ దీప్ పేరు మర్చిపోయాడు. శార్దూల్, పంత్, బుమ్రా స్థానాల్లో ప్రసిద్, జురెల్, కరుణ్ వస్తున్నారని మాత్రమే చెప్పాడు.