పడిక్కల్- అభిమన్యు
సౌతాఫ్రికా- ‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్- ‘ఎ’ (IND A vs SA A) జట్టు మిశ్రమ ఫలితం చవిచూసింది. బెంగళూరు వేదికగా జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసుకుంది. రెండో టెస్టులో పంత్ సేన విజయం ఖాయమని భావించగా.. ప్రొటిస్ జట్టు సంచలన రీతిలో గెలుపును తన్నుకుపోయింది.
ఈ మ్యాచ్‌లో అదే పెద్ద హైలైట్!
ఏకంగా 400 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ ‘ఎ’తో జరిగిన రెండో అనధికారిక టెస్టులో 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. 2 మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. భారత్‌లాంటి స్పిన్ వేదికలపై నాలుగో ఇన్నింగ్స్ (ఛేదించే జట్టు రెండో ఇన్నింగ్స్) అది కూడా చివరి రోజు చాలా కష్టం.
అయినాసరే సఫారీ ‘ఎ’ జట్టు భారత రెగ్యులర్ టెస్టు బౌలర్లు సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్‌లను ఎదుర్కొని మరీ భారీ లక్ష్యాన్ని ఛేదించడమే ఈ మ్యాచ్‌లో పెద్ద హైలైట్! ఓవరాల్‌గా ‘ఎ’ జట్ల అనధికారిక నాలుగు రోజుల మ్యాచ్‌ల్లోనే ఇది అత్యధిక పరుగుల ఛేదనగా ఘనతకెక్కింది.
ధ్రువ్ జురెల్ ఒక్కడే..
ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్లలో ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) ఒక్కడే మెరుగ్గా రాణించాడు. రెండో టెస్టులో రెండుసార్లు శతక్కొట్టి సత్తా చాటాడు. తద్వారా టీమిండియా తరఫున టెస్టుల్లో కేవలం వికెట్ కీపర్ బ్యాకప్ ఆప్షన్‌గా కాకుండా.. స్పెషలిస్టు బ్యాటర్‌గా రాణించగలనని మరోసారి నిరూపించాడు.
దారుణంగా విఫలం
మరోవైపు.. తమిళనాడు ఆటగాడు సాయి సుదర్శన్ (Sai Sudharsan), కర్ణాటక క్రికెటర్ దేవదత్ పడిక్కల్ మాత్రం ఈ సిరీస్‌లో విఫలమయ్యారు. సాయి నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 84 పరుగులు చేయగా.. పడిక్కల్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 6,5,5,24.
ఇక టీమిండియా తరఫున టెస్టుల్లో బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపికవుతూ.. ఇప్పటికీ అరంగేట్రం చేయలేకపోయిన బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ పూర్తిగా ఫెయిలయ్యాడు. రెండో టెస్టుతో జట్టులో చేరిన అతడు డకౌట్ అయ్యాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సెలక్టర్ దేవాంగ్ గాంధీ సాయి, పడిక్కల్, అభిమన్యులపై విమర్శలు గుప్పించాడు. ‘‘విఫలమైనా... సాయి సుదర్శన్ ఇంకా యువకుడే కాబట్టి సెలక్టర్లు అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వవచ్చు. టెస్టు ఫార్మాట్లో బ్యాకప్ బ్యాటర్ల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
భారత్- ‘ఎ’ తరఫునా పరుగులు చేయలేరు.. జట్టులో చోటెలా?
పడిక్కల్ భారత్- ‘ఎ’ తరఫున కూడా పరుగులు రాబట్టలేకపోతున్నాడు. బ్యాకప్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ ఇలాగే కొనసాగితే అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. జట్టులోకి రావడం కలగానే మిగిలిపోతుంది.
స్పష్టతకు రావాలి..
ఏదేమైనా జురెల్ ఒక్కడే ప్రస్తుతం నిలకడగా రాణిస్తున్నాడు. అయితే, అతడిని కేవలం బ్యాకప్ వికెట్ కీపర్‌గా మాత్రమే వాడకుంటామంటే.. రిషభ్ పంత్ కారణంగా అతడికి తుదిజట్టులో చోటు దక్కదు. కాబట్టి అతడి పాత్రపై సెలక్టర్లు స్పష్టతకు రావాలి.
అంతేకాదు.. వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లను సెలక్టర్లు కవర్ చేయాలి. సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాలి. ఈ దేశీ సీజన్‌లో సెలక్టర్లు ఈ విషయంలో కఠినంగా శ్రమిస్తేనే మెరుగైన ఎంపికలు చేయగలరు’’ అని దేవాంగ్ గాంధీ టైమ్స్ ఆఫ్ ఇండియాతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
చదవండి: వన్డే ఆల్‌టైమ్ జట్టు.. టీమిండియా నుంచి ముగ్గురు.. రోహిత్‌కు దక్కని చోటు


