BCCI: వెస్టిండీస్‌తో టెస్టులకు టీమిండియా ప్రకటన.. అతడిపై వేటు | BCCI Announces Indian Squad For West Indies Series Karun Nair Dropped | Sakshi
Sakshi News home page

BCCI: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా ప్రకటన.. అతడిపై వేటు

Sep 25 2025 12:50 PM | Updated on Sep 25 2025 1:23 PM

BCCI Announces Indian Squad For West Indies Series Karun Nair Dropped

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) తమ జట్టును ప్రకటించింది. శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) సారథ్యంలో.. పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను గురువారం వెల్లడించింది.

ఇక స్వదేశంలో జరిగే ఈ సిరీస్‌కు గిల్‌ డిప్యూటీగా సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను.. బీసీసీఐ వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీ ఆడిన జట్టులో స్వల్ప మార్పులతోనే భారత్‌ విండీస్‌తో బరిలో దిగనుంది.

రిషభ్‌ పంత్‌ దూరం.. కరుణ్‌పై వేటు
వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) గాయం నుంచి ఇంకా కోలుకోని కారణంగా వెస్టిండీస్‌తో సిరీస్‌కు దూరం కాగా.. ఇంగ్లండ్‌ పర్యటనలో వరుస వైఫల్యాలు చవిచూసిన కరుణ్‌ నాయర్‌పై వేటు పడింది. కాగా దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత టీమిండియా తరఫున ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన కరుణ్‌ నాయర్‌ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

ధ్రువ్‌ జురెల్‌తో పాటు అతడు..
ఐదు టెస్టుల్లో భాగంగా నాలుగు మ్యాచ్‌లు ఆడిన కరుణ్‌ నాయర్‌.. కేవలం ఒకే ఒక్క హాఫ్‌ సెంచరీ చేయగలిగాడు. దీంతో బీసీసీఐ అతడికి మరో అవకాశం ఇచ్చేందుకు మొగ్గుచూపకపోవడం గమనార్హం. మరోవైపు.. వికెట్‌ కీపర్ల కోటాలో.. పంత్‌ గైర్హాజరీలో ధ్రువ్‌ జురెల్‌తో పాటు తమిళనాడు ప్లేయర్‌ నారాయణ్‌ జగదీశన్‌ జట్టుకు ఎంపికయ్యాడు.

నితీశ్‌ రెడ్డికి చోటు
ఇక గాయం వల్ల ఇంగ్లండ్‌ సిరీస్‌ మధ్యలోనే జట్టుకు దూరమైన ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి కూడా.. విండీస్‌తో సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. 

ఇక పేస్‌ విభాగంలో జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌తో కలిసి ప్రసిద్‌ కృష్ణ మరోసారి సేవలు అందించనున్నాడు. స్పెషలిస్టు స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తన స్థానాన్ని నిలబెట్టుకోగా.. స్పిన్‌ ఆల్‌రౌండర్ల కోటాలో జడేజా, అక్షర్‌ పటేల్‌తో కలిసి వాషింగ్టన్‌ సుందర్‌ బరిలో దిగనున్నాడు.

2-2తో సమం
కాగా ఆసియా టీ20 కప్‌- 2025 టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా సొంతగడ్డపై రెండు టెస్టులు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27లో భాగంగా అక్టోబరు 2- అక్టోబరు 14 వరకు ఈ సిరీస్‌ జరుగుతుంది. కాగా చివరగా గిల్‌ సేన ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో తలపడి 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే. 

వెస్టిండీస్‌తో టెస్టులకు భారత జట్టు
శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా (వైస్‌ కెప్టెన్‌), వాషింగ్టన్‌ సుందర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, అక్షర్‌ పటేల్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, నారాయణ్‌ జగదీశన్‌ (వికెట్‌ కీపర్‌), మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌.

చదవండి: పాక్‌ ఆటగాళ్ల బరితెగింపు.. షాకిచ్చిన బీసీసీఐ!.. తగ్గమంటూ పీసీబీ ఓవరాక్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement