
భారత పురుషుల క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో వెర్వేరు కెప్టెన్లు ఉన్న సంగతి తెలిసిందే. వన్డేల్లో రోహిత్ శర్మ, టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్, టెస్టుల్లో శుబ్‌మన్ గిల్ టీమిండియా సారథిలుగా ఉన్నారు. రోహిత్ శర్మ టీ20, టెస్టుల నుంచి రిటైర్ కావడంతో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.
తాజాగా ఈ ముగ్గురు కెప్టెన్ల విధానంపై బీసీసీఐ మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
"ప్రస్తుతం శుబ్‌మన్ గిల్‌ను చూస్తుంటే 2017లో విరాట్ కోహ్లిలా కన్పిస్తున్నాడు. లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోని హయంలో విరాట్ బాగా రాటు దేలాడు. ఆ తర్వాత అతడి వారుసుడిగా కోహ్లి భారత జట్టు పగ్గాలు చేపట్టాడు. ఇప్పుడు గిల్ కూడా విరాట్ లాగే రోహిత్ సారథ్యంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు.
టెస్ట్ కెప్టెన్‌గా గిల్‌ను నియమించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన ముందుచూపును చాటుకున్నాడు. టీ20 ఫార్మాట్‌కు కూడా గిల్ సరిపోతాడు. 2026 టీ20 ప్రపంచకప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌కు బదులుగా ఎవరు కెప్టెన్సీ తీసుకుంటారనే దానిపై బీసీసీఐ స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలి.
ఇతర దేశాలు మాదిరిగా భారత్‌లో స్ప్లిట్ కెప్టెన్సీ దీర్ఘకాలంలో పనిచేయదు. అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న ఒక ఆటగాడు ఒక ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఉన్నప్పుడు, మిగిలిన ఫార్మాట్లకు కూడా అతనే నాయకత్వం వహించాలి. గిల్ బ్యాటర్‌గా కూడా రాణించాడు.
అంతేకాకుండా ఐపీఎల్‌లో కూడా అతడు సారథ్యం వహించాడు" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాంధీ పేర్కొన్నాడు. కాగా రోహిత్ శర్మ భారత వన్డే జట్టు కెప్టెన్‌గా గిల్ ఎంపికయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.
చదవండి: Asia Cup 2025: సంజూ శాంసన్‌కు నో ఛాన్స్..? ఆర్సీబీ స్టార్‌కు చోటు?