
ఆసియాకప్-2025 టోర్నీకి సమయం అసన్నమవుతోంది. ఈ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 9న నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ ఖండాంతర టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. భారత క్రికెట్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగనుంది.
ఈ ఆసియా సింహాల పోరు కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ వచ్చే వారం ప్రకటించనుంది. అయితే ఈ 18 మంది సభ్యుల జట్టులో ఎవరికి చోటు దక్కుతుందా అని అందరూ ఆతృతగా ఎదరుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ దీప్ దాస్‌గుప్తా కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఆసియాకప్ కోసం భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు చోటు దక్కడం కష్టమేనని అతడు అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో అతడి కంటే మెరుగ్గా రాణించిన వికెట్ కీపర్లు ఉన్నారని ఆయన అన్నారు.
కాగా గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంజూ శాంసన్ టీ20ల్లో అదరగొట్టాడు. శాంసన్ 16 ఇన్నింగ్స్‌లలో 34.78 సగటుతో 487 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. కానీ బలమైన ఇంగ్లండ్ జట్టుపై మాత్రం ఈ కేరళ ఆటగాడు బ్యాట్ ఝూళిపించలేకపోయాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. అందులో మూడు సింగిల్ డిజిట్ స్కోర్లు ఉన్నాయి.
"సంజూ శాంసన్ ఇటీవల కాలంలో టీ20ల్లో అద్బుతంగా రాణించాడు. కానీ స్వదేశంలో ఇంగ్లండ్‌తో పూర్తి స్దాయి జట్టుతో ఆడినప్పుడు శాంసన్ ఇబ్బంది పడ్డాడు. సూర్యకుమార్ నాయకత్వంలో భారత్ తమ ప్రధాన జట్టులో ఆడిన ఏకైక సిరీస్ అది. అక్కడ అతడు ఆకట్టుకోలేకపోయాడు.
అతడు ఆసియాకప్‌నకు ఎంపికయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఓపెనర్‌గా అభిశర్మ ఎలానూ ఉంటాడు. మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నాను. అతడికి టీ20ల్లో మంచి రికార్డుతో పాటు అనుభవం ఉంది.
ఇప్పుడు వికెట్ కీపర్ స్లాట్ కోసం జితేష్ శర్మ, సంజూ శాంసన్‌ల మధ్య పోటీ నెలకొంది. జితేష్‌కు మిడిల్ ఆర్డర్‌లో అనుభవం ఉంది. అంతేకాకుండా అతడు మంచి ఫినిషింగ్ కూడా అందించగలడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున తన సత్తా ఎంటో జితేష్ చూపించాడు. ఒకవేళ శాంసన్ ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కడం కష్టమే" అని దాస్‌గుప్తా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.