
2021లో ట్రోఫీతో కోహ్లి (PC: ICC)
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2027 (WTC) ఫైనల్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోందా?.. అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాల నుంచి అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మెగా మ్యాచ్‌ను నిర్వహించేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్లు బీసీసీఐ.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.
మేము నిర్వహిస్తాం
గత నెలలో జింబాబ్వే వేదికగా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్‌కు భారత్ తరఫున అరుణ్ ధుమాల్ హాజరయ్యారు. ఈ క్రమంలో చర్చల్లో భాగంగా డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహణ పట్ల బీసీసీఐకి ఆసక్తి ఉందన్న విషయాన్ని ఆయన ఐసీసీ అధికారులకు చెప్పినట్లు ‘ది గార్డియన్’ కథనం పేర్కొంది.
కాగా 2019లో తొలిసారిగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను ఆరంభించారు. ఇప్పటికి ఈ ఐసీసీ టోర్నీకి సంబంధించి మూడు సీజన్లు (2019-2021, 2021-23, 2023-25)ముగిశాయి. ఇందులో తొలి రెండు ఎడిషన్లలో టీమిండియా ఫైనల్‌కు వెళ్లింది.
ఈసారి అదీ లేదు
అయితే, 2021 టైటిల్ పోరులో న్యూజిలాండ్ చేతిలో.. అదే విధంగా 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక 2023-25 సీజన్‌లో మాత్రం భారత జట్టు ఫైనల్‌కు చేరలేకపోయింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో 3-0తో వైట్‌వాష్ కావడం.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 3-1తో ఓడిపోవడం ఇందుకు ప్రధాన కారణం.
మూడూ ఇంగ్లండ్‌లోనే
ఈ క్రమంలో టీమిండియాపై పైచేయి సాధించిన ఆస్ట్రేలియా- సౌతాఫ్రికాతో కలిసి డబ్ల్యూటీసీ-2025 ఫైనల్‌కు చేరింది. ఇక ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లన్నింటికీ ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చింది.
సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్‌లో 2021, ది ఓవల్ మైదానంలో 2023 ఫైనల్‌ను నిర్వహించారు. ఈసారి ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆసీస్- ప్రొటిస్ జట్లు టైటిల్ కోసం తలపడబోతున్నాయి. ఈ మెగా మ్యాచ్ తర్వాత టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టులతో డబ్ల్యూటీసీ 2025-27 సీజన్ ఆరంభం కానుంది.
ఈ నేపథ్యంలో ఈసారి భారత్ ఫైనల్ చేరితే తాము ఆ మ్యాచ్‌ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీసీసీఐ ఐసీసీకి తెలియజేసినట్లు సమాచారం. ఈ మేరకు.. ‘‘ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో డబ్ల్యూటీసీ ఫైనల్ 2027 బిడ్‌కు సంబంధించి భారత్ తమ ఆసక్తిని తెలియజేసింది.
అరుణ్ సింగ్ ధుమాల్ బీసీసీఐ తరఫున ఐసీసీ ముందు ఈ ప్రతిపాదన ఉంచారు. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌గా.. బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా ఉన్నారు. కాబట్టి భారత్‌కు ఈ బిడ్ దక్కే అవకాశం ఉంది’’ అని ది గార్డియన్ పేర్కొంది.
ఐసీసీ నిర్ణయం ఏమిటి?
డబ్ల్యూటీసీ ఫైనల్-2027 వేదికను భారత్‌కు తరలించే విషయంలో ఐసీసీ మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. టీమిండియా ఈ మెగా మ్యాచ్‌కు అర్హత సాధిస్తే ఫర్వాలేదు.. అలా కాని పక్షంలో భారత్‌లో ఈ మ్యాచ్‌కు ఊహించిన స్థాయిలో ఆదరణ లభించదని ఐసీసీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అదే ఇంగ్లండ్‌లో అయితే.. వేసవిలో కౌంటీలతో పాటు ఈ మెగా పోరును వీక్షించేందుకు ప్రేక్షకులు స్టేడియానికి తరలివస్తారనే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఇంగ్లండ్‌నే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సరైన వేదికగా ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈసారి టీమిండియా ఫైనల్‌కు చేరకపోవడంతో ఇంగ్లండ్ బోర్డుకు టికెట్ల రూపేణా వచ్చే ఆదాయం భారీగా తగ్గినట్లు వార్తలు వచ్చాయి. దాదాపు రూ. 45 కోట్లు మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నష్టపోయినట్లు కథనాలు వచ్చాయి.
చదవండి: IPL 2025: మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్!