
ధర్మశాల స్టేడియం (PC: BCCI)
ఐపీఎల్-2025 (IPL 2025)లో మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణ ఎప్పుడన్న అంశంపై క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికి ఈ సీజన్‌లో లీగ్ దశలో భాగంగా 58 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అయితే, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టోర్నీ వాయిదా పడిన విషయం తెలిసిందే.
అందుకే వాయిదా
ఓవైపు యుద్ధం జరుగుతుండగా.. మరోవైపు వినోదం కోసం ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడం సరికాదని భావిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి, సైన్యానికి మద్దతుగా నిలిచే క్రమంలో వారం రోజుల పాటు ఐపీఎల్-2025ని వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) బీసీసీఐని సంప్రదించినట్లు సమాచారం. ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో మిగిలిన పదహారు మ్యాచ్‌లకు తాము ఆతిథ్యం ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాం
ది గార్డియన్ కథనం ప్రకారం.. ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్ బీసీసీఐ అధికారులను సంప్రదించి.. ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణ గురించి ప్రతిపాదనలు చేశారు. బీసీసీఐకి అభ్యంతరం లేకపోతే తమ దేశంలో ఈ మ్యాచ్‌లను నిర్వహిస్తామని తెలిపారు.
‘‘వారం రోజుల తర్వాత కూడా ఐపీఎల్-2025ను పునఃప్రారంభించేందుకు పరిస్థితులు అనుకూలించకపోతే.. ఈసీబీ ఆ బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. సెప్టెంబరులో మిగిలిన మ్యాచ్‌లను తాము పూర్తి చేస్తామని ఈసీబీ వర్గాలు వెల్లడించాయి’’ అని ది గార్డియన్ పేర్కొంది.
కాగా మార్చి 22న మొదలైన ఐపీఎల్ పద్దెనిమిదవ ఎడిషన్ మే 25తో ముగియాల్సి ఉంది. అయితే, సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో ధర్మశాలలో మే 8 నాటి పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మధ్యలోనే రద్దు చేశారు. ఈ క్రమంలో టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తారనే వార్తలు రాగా.. వారం పాటు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.
ఢిల్లీకి చేరుకున్నారు
ఇదిలా ఉంటే.. పంజాబ్- ఢిల్లీ ఆటగాళ్లతో సహా సహాయక సిబ్బంది మొత్తాన్ని వందే భారత్ రైలులో జలంధర్ నుంచి ఢిల్లీకి సురక్షితంగా తరలించారు. ఇక కొంత మంది విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు వెళ్లాలని భావిస్తుండగా.. ఫ్రాంఛైజీలు అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. దాడులకు బరితెగించిన పాకిస్తాన్‌కు భారత్ దీటుగా సమాధానం ఇస్తుండటంతో దాయాది ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్-2025ని ఇప్పటికైతే నిలిపివేస్తున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.