
29 పరుగుల వద్ద తొలి వికెట్... సరిగ్గా 100 పరుగులు పూర్తి చేసిన తర్వాత రెండో వికెట్.. మరో రెండు పరుగులు జతచేసి రెండు వికెట్లు (102/4).. ఆ తర్వాత వైడ్ రూపంలో ఒక పరుగు అంటే అప్పటికి స్కోరు 103/4.. అదే స్కోరు వద్ద ఐదో వికెట్ కూడా డౌన్.. ఒక్క పరుగు జతచేర్చిన వెంటనే ఆరో వికెట్ కూడా పడింది (104/6)..
మళ్లీ ఆలస్యం చేయకూడదు అనుకున్నారేమో బ్యాటర్లు.. అదే స్కోరు వద్ద ఏడో వికెట్ కూడా డౌన్.. వైడ్ రూపంలో మరో పరుగు రాగానే ఎనిమిదో వికెట్ కూడా పడిపోయింది.. అప్పటికి స్కోరు 105/8.. మరో పందొమ్మిది పరుగులు రాగానే తొమ్మిదో వికెట్ కూడా పడింది.. 167 పరుగులకు ఆలౌట్..
ఐదు పరుగులు, ఏడు వికెట్లు
శ్రీలంకతో తొలి వన్డే సందర్భంగా బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిన విధానం ఇది.. 100-1తో పటిష్టంగా కనిపించిన బంగ్లా.. కేవలం ఐదు పరుగుల వ్యవధిలోనే మరో ఏడు వికెట్లు కోల్పోయింది. తమ స్కోరుకు కేవలం ఐదు పరుగులు జతచేసి ఏడు వికెట్ల నష్టాన్ని చవిచూసింది. లంక బౌలర్ల ధాటికి తాళలేక 167 పరుగులకే కుప్పకూలి.. 77 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఈ మేరకు బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించిన శ్రీలంక ఖాతాలో ఓ ప్రపంచ రికార్డు నమోదైంది. వన్డే క్రికెట్ చరిత్రలో.. అత్యధికసార్లు ప్రత్యర్థి జట్టు మీద ఏడు లేదా అంతకంటే తక్కువ పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కూల్చిన తొలి జట్టుగా లంక నిలిచింది. లంక ఇలా ప్రత్యర్థిని కుదేలు చేయడం ఇది మూడోసారి.
2008లో జింబాబ్వే మీద మూడు పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కూల్చిన లంక.. 2024లో అఫ్గనిస్తాన్ మీద. ఏడు పరుగుల వ్యవధిలో ఈ ఘనత సాధించింది. తాజాగా బంగ్లాదేశ్ మీద ఐదు పరుగుల వ్యవధిలో ఈ ఫీట్ నమోదు చేసింది.
వన్డే క్రికెట్ చరిత్రలో తక్కువ పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కూల్చిన జట్లు
🏏శ్రీలంక- 2008లో హరారే వేదికగా- జింబాబ్వేను 124-3 నుంచి 127-10కి పడగొట్టింది.
🏏శ్రీలంక- 2025లో కొలంబో వేదికగా- బంగ్లాదేశ్‌ను 100-1 నుంచి 105-8కు పడగొట్టింది.
🏏వెస్టిండీస్- 1986లో షార్జా వేదికగా- శ్రీలంకను 45-2 నుంచి 51-9కు పడగొట్టింది.
🏏శ్రీలంక- 2024లో పల్లెకెలె వేదికగా- అఫ్గనిస్తాన్‌ను 146-3 నుంచి 153-10కు పడగొట్టింది.
🏏నేపాల్- 2020లో కీర్తిపూర్ వేదికగా- యూఎస్‌ఏను 27-2 నుంచి 35-9కి పడగొట్టింది.
🏏భారత్- 2014లో మిర్పూర్ వేదికగా- బంగ్లాదేశ్‌ను 50-3 నుంచి 58-10కు పడగొట్టింది.
వన్డేల్లోనూ శుభారంభం
సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నెగ్గిన శ్రీలంక జట్టు... వన్డేల్లోనూ శుభారంభం చేసిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 77 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ చరిత అసలంక (123 బంతుల్లో 106; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (43 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.
టెస్టు సిరీస్‌లో దంచికొట్టిన పాథుమ్ నిసాంక (0), నిశాన్ మధుషనక (6), కమిందు మెండిస్ (0) ఈసారి విఫలమయ్యారు. జనిత్ లియాంగె (29), మిలాన్ రత్ననాయకె (22), వనిందు హసరంగ (22) ఫర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ అహ్మద్ 4, తన్జీమ్ హసన్ మూడు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 35.5 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. తన్జీద్ హసన్ (61 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్), జాకీర్ అలీ (64 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకాలతో పోరాడగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు.
లంక బౌలర్ల ధాటికి కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ (0), లిటన్ దాస్ (0), పర్వేజ్ (13), నజు్మల్ షంటో (23), తౌహిద్ హృదయ్ (1) పెవిలియన్‌కు వరుస కట్టారు. లంక బౌలర్లలో హసరంగ 4, కమిందు మెండిస్ 3 వికెట్లు పడగొట్టారు. అసలంకకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శనివారం రెండో వన్డే జరగనుంది.
సంక్లిప్త స్కోర్లు
🏏శ్రీలంక- 244 (49.2)
🏏బంగ్లాదేశ్- 167 (35.5).
చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
Bangladesh’s batting: now you see it, now you don’t 🎩
The visitors went off a cliff in Colombo losing 7 wickets for just 5 runs in a stunning meltdown 😳#SLvBAN pic.twitter.com/8ea1xiXjOz— FanCode (@FanCode) July 2, 2025