
ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కెప్టెన్‌గా సూర్యకుమార్ ఎంపికను అందరూ స్వాగతిస్తున్నప్పటికీ.. గిల్‌కు వైస్ కెప్టెన్సీ కట్టబెట్టడాన్ని మాత్రం కొందరు వ్యతిరేకిస్తున్నారు. గిల్ కోసం యశస్వి జైస్వాల్ లాంటి ఆటగాడిని తప్పించడాన్ని తప్పుబడుతున్నారు. అలాగే శ్రేయర్ అయ్యర్‌కు జరిగిన అన్యాయాన్ని కూడా నిలదీస్తున్నారు.
సిరాజ్‌ను కాదని రాణా ఎంపిక.. ఫ్యాన్స్ ఆగ్రహం
ఆసియా కప్ జట్టు ఎంపికలో జైస్వాల్, శ్రేయస్‌తో పాటు మరో అర్హుడైన ఆటగాడికి కూడా అన్యాయం జరిగింది. గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా సత్తా చాటుతూ, టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న పేస్ గన్ మొహమ్మద్ సిరాజ్‌ను కూడా ఆసియా కప్‌కు ఎంపిక చేయలేదు.
సిరాజ్‌ను కాదని హర్షిత్ రాణాను ఎంపిక చేయడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. ఈ విషయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక పాత్రధారి అని ఆరోపిస్తున్నారు. అతడి ప్రోద్బలం వల్లే సిరాజ్‌ను కాదని హర్షిత్‌ను ఎంపిక చేసుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిరాజ్ ఎంత విలువైన బౌలరో ఇటీవల ప్రపంచం మొత్తం చూసిందని గుర్తు చేస్తున్నారు. ఇంగ్లండ్‌లో సిరాజ్ చేసిన మ్యాజిక్‌ను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఒత్తిడి సమయాల్లో హర్షిత్‌తో పోలిస్తే సిరాజ్ అనుభవం చాలా పనికొస్తుందని అని అంటున్నారు. సిరాజ్‌ను కాదని హర్షిత్‌ను ఎంపిక చేయడం బుద్దిలేని చర్యగా అభివర్ణిస్తున్నారు.
కాగా, తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. అయినా సిరాజ్ ఆసియా కప్ జట్టులో స్థానం నోచుకోలేదు. సిరాజ్‌ను కాదని భారత సెలెక్టర్లు హర్షిత్ రాణాకు అవకాశం ఇచ్చారు.
సిరాజ్‌కు టీ20 ఫార్మాట్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉన్నా సెలెక్టర్లు ఎందుకు పక్కకు పెట్టారో తెలియడం లేదు. సిరాజ్ తాజా ఐపీఎల్ సీజన్‌లోనూ గుజరాత్ తరఫున మంచిగా పెర్ఫార్మ్ చేశాడు. హర్షిత్‌తో పోలిస్తే సిరాజ్ అన్ని విషయాల్లో చాలా మెరుగ్గా ఉన్నాడు.
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో సన్నిహిత సంబంధాలు ఉండటం చేత హర్షిత్‌కు ఆసియా కప్ బెర్త్ దక్కిందని ప్రచారం జరుగుతుంది. గంభీర్ ఐపీఎల్‌లో కేకేఆర్ మెంటార్‌గా ఉన్నప్పుడు హర్షిత్ ఆ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ సాన్నిహిత్యం కారణంగానే గంభీర్ హెడ్ కోచ్ కాగానే హర్షిత్‌కు టీమిండియా బెర్త్ దక్కింది.
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్
స్టాండ్ బై ప్లేయర్లు: ప్రసిద్ద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్