
మహిళల ప్రీమియర్ లీగ్-2026(WPL) మెగా వేలానికి ముహార్తం ఖారైరనట్లు తెలుస్తోంది. ఈఎస్సీఎన్ క్రిక్‌ఇన్ ఫో ప్రకారం.. ఈ ఏడాది నవంబర్ 25 లేదా 29న వేలం నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సిద్దమవుతున్నట్లు సమాచారం.
29వ తేదీ శనివారం కావడంతో అదే రోజున వేలం జరిగే అవకాశముంది. ఈ మహిళల టోర్నమెంట్ కేవలం మూడు సీజన్లు మాత్రమే పూర్తి చేసుకున్నందున.. ముంబై ఇండియన్స్ ఉమెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్, ఢిల్లీ క్యాపిటల్స్ వేలం నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కానీ బీసీసీఐ మాత్రం మెగా వేలం నిర్వహణకే మొగ్గు చూపింది.
ఐదుగురికే ఛాన్స్
డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ వేలం నేపథ్యంలో ఐదు ఫ్రాంచైజీలకు గురువారం నిర్వాహకులు ఈమెయిల్ పంపించారు. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా ఐదుగురిని రిటైన్ చేసుకోవచ్చు ఈమెయిల్‌లో రాసుకొచ్చారు. వారిలో ముగ్గురు ఇండియన్ క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉండాలి.
భారత క్రికెటర్లలో ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లను రిటైన్ చేసుకునేందుకు కూడా వీలు కల్పించారు. ఒకవేళ ఫ్రాంచైజీలు ఐదు మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంటే వారిలో కచ్చితంగా ఒకరు అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ ఉండాలి. ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను సమర్పించడానికి నవంబర్ 5 డెడ్‌లైన్‌గా విధించారు. ఐపీఎల్ మాదిరిగానే డబ్ల్యూపీఎల్‌లో రైట్ టు మ్యాచ్‌ను అనుమతిస్తూ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఒక ఫ్రాంచైజీ గరిష్టంగా ఐదు ఆర్టీఎమ్ కార్డులను ఉపయోగించకోవచ్చు.
రూ. 15 కోట్లతో వేలం..
డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ వేలంలో ఫ్రాంచైజీలు రూ.15 కోట్లు ఖర్చు చేయనున్నాయి. రిటెన్షన్ కోసం ఐదు స్లాబ్‌లు రూ.3.5 కోట్లు (ప్లేయర్ 1), రూ. 2.5 కోట్లు (ప్లేయర్ 2), రూ.1.75 కోట్లు (ప్లేయర్ 3), రూ. 1 కోటి(ప్లేయర్ 4), రూ. 50 లక్షలు (ప్లేయర్ 5)గా నిర్ణయించారు. కానీ ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు కంటే ఎక్కువ చెల్లించడానికి బీసీసీఐ అనుమతిచ్చింది.
చదవండి: World cup: రిచా ఘోష్ తుపాన్ ఇన్నింగ్స్.. టీమిండియా స్కోరెంతంటే?