
వైజాగ్‌లో భారత మహిళల అనూహ్య ఓటమి
3 వికెట్లతో నెగ్గిన దక్షిణాఫ్రికా
సఫారీలను గెలిపించిన డి క్లెర్క్
రిచా ఘోష్ ఇన్నింగ్స్ వృథా
ఆదివారం ఆస్ట్రేలియాతో హర్మన్ బృందం ఢీ
వన్డే వరల్డ్ కప్ వేటలో విశాఖ తీరాన భారత మహిళల బృందానికి అనూహ్య ఓటమి ఎదురైంది. గెలుపు ఖాయమనుకున్న దశలో దక్షిణాఫ్రికా బ్యాటర్ డి క్లెర్క్ చెలరేగి భారత్‌నుంచి మ్యాచ్‌ను లాక్కుంది. చివరి 5 ఓవర్లలో 52 పరుగులు చేయాల్సి ఉండగా 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాదిన డి క్లెర్క్ 7 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించింది. అంతకు ముందు భారత్ మళ్లీ బ్యాటింగ్‌లో తడబడింది. అయితే రిచా ఘోష్ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరుగైన స్కోరును అందించింది. ఆదివారం ఇదే వైజాగ్ మైదానంలో ఆస్ట్రేలియాతో హర్మన్ సేన తలపడుతుంది.
సాక్షి క్రీడా ప్రతినిధి, విశాఖపట్నం: మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది.
రిచా ఘోష్ (77 బంతుల్లో 94; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ అవకాశం చేజార్చుకుంది. ఒక దశలో భారత్ స్కోరు 153/7 కాగా...రిచా, స్నేహ్ రాణా (24 బంతుల్లో 33; 6 ఫోర్లు) ఎనిమిదో వికెట్‌కు 53 బంతుల్లో 88 పరుగులు జోడించి మెరుగైన స్థితికి చేర్చారు.
అనంతరం దక్షిణాఫ్రికా 48.5 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసింది. కెప్టెన్ లారా వోల్‌వర్ట్ (111 బంతుల్లో 70; 8 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడింది. అయితే చివర్లో నాడిన్ డి క్లెర్క్ (54 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్ దక్షిణాఫ్రికాను గెలిపించింది. వర్షం కారణంగా మ్యాచ్ గంట ఆలస్యంగా మొదలైంది.
హర్మన్ మళ్లీ విఫలం...
స్మృతి మంధాన (32 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) కాస్త జాగ్రత్తగా బ్యాటింగ్ చేసింది. 21వ బంతికి గానీ ఆమె తొలి బౌండరీ కొట్టలేకపోయింది. మరో ఓపెనర్ ప్రతీక రావల్ (56 బంతుల్లో 37; 5 ఫోర్లు) చక్కటి ఆఫ్‌సైడ్ షాట్లతో ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత దక్షిణాఫ్రికా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత్ 47 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు చేజార్చుకుంది.
ఓపెనర్లతో పాటు హర్లీన్ డియోల్ (13) కూడా వెనుదిరగ్గా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (9) తన వైఫల్యాన్ని కొనసాగించింది. జెమీమా రోడ్రిగ్స్ (0) టోర్నీలో రెండో డకౌట్‌ను తన ఖాతాలో వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత దీప్తి (4) పెవిలియన్ చేరింది. ఈ దశలో అమన్‌జోత్ (13)తో రిచా జత కలిసింది. వీరిద్దరు కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.
రిచా షో...
40వ ఓవర్ చివరి బంతికి అమన్ అవుటైంది. ఆ సమయంలో 153/7 వద్ద స్కోరు 200 దాటడం కూడా కష్టమే అనిపించింది. ఈ స్థితిలో రిచా చెలరేగిపోయింది. క్లెర్క్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్ కొట్టిన ఆమె 53 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఖాకా వేసిన 47వ ఓవర్లో వరుసగా 4, 4, 6తో పండగ చేసుకుంది. ఇన్నింగ్స్ చివరి ఓవర్ ఆరంభానికి ముందు 84 పరుగుల వద్ద ఉన్న రిచా...వరుసగా 2, 4, 4తో 94కు చేరుకుంది. అయితే తర్వాతి బంతికి అవుటై శతకం కోల్పోయింది. ఆఖరి 10 ఓవర్లలో భారత్ 98 పరుగులు చేయడం విశేషం.
టపటపా...
ఛేదనలో దక్షిణాఫ్రికా ఆరంభంలో తేలిపోయింది. తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ లారా మినహా ప్రధాన బ్యాటర్లంతా కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోవడంతో సఫారీలకు ఓటమి తప్పదనిపించింది. అయితే డి క్లెర్క్, క్లో ట్రయాన్ (66 బంతుల్లో 49; 5 ఫోర్లు) అసాధారణ పోరాటం ఆ జట్టును గెలిపించింది.
982
స్మృతి మంధాన 2025లో వన్డేల్లో చేసిన పరుగులు. ఒకే క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బెలిండా క్లార్క్ (970 – 1997) రికార్డును ఆమె అధిగమించింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: ప్రతీక (సి) బ్రిట్స్ (బి) సెఖుఖునే 37; స్మృతి (సి) లూస్ (బి) ఎంలాబా 23; హర్లీన్ (బి) ఎంలాబా 13; హర్మన్‌ప్రీత్ (సి) కాప్ (బి) ట్రయాన్ 9; జెమీమా (ఎల్బీ) (బి) ట్రయాన్ 0; దీప్తి (సి) జాఫ్తా (బి) కాప్ 4; అమన్‌జోత్ (సి) లూస్ (బి) ట్రయాన్ 13; రిచా (సి) ట్రయాన్ (బి) డి క్లెర్క్ 94; రాణా (సి) వోల్‌వార్ట్ (బి) కాప్ 33; క్రాంతి (నాటౌట్) 0; శ్రీచరణి (సి) వోల్‌వార్ట్ (బి) డి క్లెర్క్ 0; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 251. వికెట్ల పతనం: 1–55, 2–83, 3–91, 4–92, 5–100, 6–102, 7–153, 8–241, 9–251, 10–251. బౌలింగ్: మరిజాన్ కాప్ 9–0–45–2, ఖాకా 7–0–47–0, డి క్లెర్క్ 6.5–0–52–2, ఎంలాబా 10–0–46–2, సెఖుఖునే 7–0–29–1, ట్రయాన్ 10–0–32–3.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: వోల్‌వార్ట్ (బి) క్రాంతి 70; బ్రిట్స్ (సి) అండ్ (బి) క్రాంతి 0; లూస్ (సి) రిచా (బి) అమన్‌జోత్ 5; మరిజాన్ కాప్ (బి) స్నేహ్ 20; బాష్ (సి) అండ్ (బి) దీప్తి 1; జాఫ్తా (ఎల్బీ) (బి) శ్రీచరణి 14; ట్రయాన్ (ఎల్బీ) (బి) రాణా 49; డి క్లెర్క్ (నాటౌట్) 84; ఖాకా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (48.5 ఓవర్లలో 7 వికెట్లకు) 252. వికెట్ల పతనం: 1–6, 2–18, 3–57, 4–58, 5–81, 6–142, 7–211. బౌలింగ్: క్రాంతి గౌడ్ 9–0–59–2, అమన్‌జోత్ 5.5–0–40–1, స్నేహ్ రాణా 10–0–47–2, శ్రీచరణి 10–1–37–1, దీప్తి 10–0–54–1, హర్మన్‌ప్రీత్ 4–0–15–0.