విజయ్ హజారే వన్డే ట్రోఫీ 2025-26లో ఉత్తర్‌ప్రదేశ్ ఆటగాడు, టీమిండియా ప్లేయర్ ధృవ్ జురెల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 4 అర్ద సెంచరీల సాయంతో 558 పరుగులు చేసి తన జట్టు తరఫున లీడింగ్ రన్ స్కోరర్‌గా, ఓవరాల్‌గా నాలుగో లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
ఇదే టోర్నీలో తన తొలి లిస్ట్-ఏ శతకాన్ని (బరోడాపై 160 నాటౌట్) నమోదు చేసిన జురెల్.. తాజాగా బెంగాల్‌పై మరో సెంచరీ సాధించాడు. 270 పరుగుల లక్ష్య ఛేదనలో 96 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఈ టోర్నీ ఆరంభం నుంచి అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్న జురెల్.. తొలి మ్యాచ్‌లో 61 బంతుల్లో 80, రెండో మ్యాచ్‌లో 57 బంతుల్లో 67, మూడో మ్యాచ్‌లో 101 బంతుల్లో 160 నాటౌట్, నాలుగో మ్యాచ్‌లో 16 బంతుల్లో 17, ఐదో మ్యాచ్‌లో 62 బంతుల్లో 55, ఆరో మ్యాచ్‌లో 61 బంతుల్లో 56, తాజాగా ఏడో మ్యాచ్‌లో 96 బంతుల్లో 123 పరుగులు చేశాడు.
మరో తలనొప్పి
ఈ పరుగుల ప్రవాహంతో జురెల్ టీమిండియా సెలెక్టర్లకు మరో తలనొప్పిగా మారాడు. ఇటీవలికాలంలో రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి చాలామంది ప్లేయర్లు ఫార్మాట్లకతీతంగా చెలరేగుతూ సెలెక్టర్లకు సవాళ్లు విసురుతున్నారు. వీరి సరసన జురెల్ కూడా చేరాడు. దీంతో ఎవరికి అవకాశం ఇవ్వాలో తెలీక సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు.
ఇప్పటికే టీమిండియా బెర్త్‌ల కోసం (అన్ని ఫార్మాట్లలో) విపరీతమైన పోటీ ఉంది. కొన్ని ఫార్మాట్లలో సీనియర్లనే పక్కకు పెట్టాల్సి వస్తుంది. కొత్తగా వీరు తయారయ్యారు. దీంతో సెలెక్టర్లకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఉండేదేమో పరిమిత బెర్త్‌లు, పోటీ చూస్తే పదుల సంఖ్యలో ఉంది. ఇలాంటి తరుణంలో భారత్‌కు రెండు జట్లు ఉంటే బాగుండనిపిస్తుంది.
ఆ స్థానానికి విపరీతమైన పోటీ
టీమిండియాలో వికెట్‌కీపింగ్ బ్యాటర్ స్థానానికి ప్రత్యేకించి చాలా పోటీ ఉంది. అందుకే ఫార్మాట్‌కు ఒకరిని చొప్పున ఎంపిక చేస్తూ ఉన్నారు. వన్డేల్లో కేఎల్ రాహుల్, టెస్ట్‌ల్లో పంత్, టీ20ల్లో సంజూ శాంసన్ ప్రస్తుతం టీమిండియా వికెట్‌కీపింగ్ బ్యాటర్లుగా కొనసాగుతున్నారు. వీరంతా తమతమ స్థానాలకు న్యాయం చేస్తూ ఉన్నారు.
ఇదే తరుణంలో ధృవ్ జురెల్, జితేశ్ శర్మ లాంటి కొత్త వారు తాము కూడా అర్హులమంటూ సెలెక్టర్లకు సవాళ్లు విసురుతున్నారు. వికెట్‌కీపింగ్ నైపుణ్యమున్న సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్ వీరికి అదనం. ఈ పరిస్థితుల్లో సెలెక్టర్ల వద్ద రొటేషన్ పద్దతి తప్ప వేరే ఆస్కారం లేకుండా పోయింది.
మ్యాచ్ విషయానికొస్తే.. జురెల్ సెంచరీతో కదంతొక్కడంతో యూపీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్.. సుదిప్ ఘరామి (94) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 269 పరుగులు చేసింది. అనంతరం యూపీ జురెల్ శతక్కొట్టడంతో 42.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. యూపీ గెలుపుకు రింకూ సింగ్ (37 నాటౌట్), అర్యన్ జుయల్ (56) కూడా సహకరించారు.


