
సౌతాఫ్రికా చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ వన్డే క్రికెట్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఫార్మాట్‌లో తానెదుర్కొన్న తొలి బంతినే భారీ సిక్సర్‌గా మలిచి రికార్డుల్లోకెక్కాడు. వన్డేల్లో ఈ ఘనతను అతి కొద్ది మంది (2002 తర్వాత) మాత్రమే సాధించారు.
బ్రెవిస్‌కు ముందు షమీమ్ హొస్సేన్ (బంగ్లాదేశ్), ఇషాన్ కిషన్ (భారత్), రిచర్డ్ నగరవ (జింబాబ్వే), క్రెయిగ్ వ్యాలెస్ (స్కాట్లాండ్), జవాద్ దావూద్ (కెనడా), జోహన్ లవ్ (సౌతాఫ్రికా) వన్డేల్లో తొలి బంతిని సిక్సర్‌గా మలిచారు. జోహన్ లవ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో సౌతాఫ్రికా ఆటగాడిగా బ్రెవిస్ రికార్డు నెలకొల్పాడు.
బాధాకరమేమిటంటే బ్రెవిస్ సిక్సర్ బాదిన మరుసటి బంతికే ఔటయ్యాడు. కెయిన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఇది జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన బ్రెవిస్ వేగంగా పరుగులు సాధించే క్రమంలో తొలి బంతికి సిక్సర్ కొట్టి, ఆతర్వాతి బంతికే ట్రవిస్ హెడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను 98 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. మార్క్రమ్ (82), బవుమా (65), మాథ్యూ బ్రీట్జ్కే (57) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో ట్రవిస్ హెడ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఓ రనౌట్ కూడా చేశాడు.
అనంతరం 297 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. కేశవ్ మహారాజ్ (10-1-33-5) ధాటికి 40.5 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (88) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఆగస్ట్ 22న జరుగనుంది.
సెంచరీ.. ఓ హాఫ్ సెంచరీ
వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో బ్రెవిస్ విశ్వరూపం ప్రదర్శించాడు. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాధించాడు. దురదృష్టవశాత్తు ఈ సిరీస్‌ను సౌతాఫ్రికా గెలవలేకపోయింది. 1-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లో బ్రెవిస్ 180 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.