
కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా మరోసారి తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను 248 పరుగులకు ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
బ్యాటింగ్‌లో మాత్రం వనిందు తన మార్క్‌ను చూపించలేకపోయాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన హసరంగా కేవలం 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో హసరంగా వన్డేల్లో తన 1000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. వ్యక్తిగత స్కోర్ ఒక్క పరుగు వద్ద ఈ ఫీట్‌ను అందుకున్నాడు.
తద్వారా వన్డేల్లో అత్యంతవేగంగా 1000 పరుగులతో పాటు 100 వికెట్లు తీసిన ఆటగాడిగా హసరంగా వరల్డ్ రికార్డు సృష్టించాడు. హసరంగా ఈ అరుదైన రికార్డును కేవలం 65 వన్డేల్లోనే అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా లెజెండరీ ఆల్‌రౌండర్ షాన్ పొలాక్ పేరిట ఉండేది. పొలాక్ ఈ ఫీట్‌ను 68 వన్డేల్లో అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో పొలాక్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.
ఇక ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓటమిపాలవ్వడంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 45.5 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. పర్వేజ్ హుసేన్ (69 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో 4, వనిందు హసరంగ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య చేధనలో శ్రీలంక 48.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది.
బంగ్లా స్పిన్నర్ తన్వీర్ ఇస్లాం (5/39) ఐదు వికెట్లు పడగొట్టి లంకను దెబ్బతీశాడు. జనిత్ లియనాగే (85 బంతుల్లో 78; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) శ్రీలంక ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే మంగళవారం పల్లెకెలెలో జరుగుతుంది.
చదవండి: IND vs ENG: పంత్‌పై శుబ్‌మన్ గిల్ సీరియస్.. ఎందుకంటే?