
బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మెహదీ హసన్ (Mahedi Hasan) అరుదైన ఘనత సాధించాడు. కొలంబోలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. తద్వారా టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును మెహదీ హసన్ షేక్ బద్దలు కొట్టాడు. శ్రీలంకతో మూడో టీ20 సందర్భంగా ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఈ ఫీట్ నమోదు చేశాడు.
రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో తొలుత టెస్టు సిరీస్ జరుగగా.. ఆతిథ్య లంక 1-0తో గెలిచింది. ఇక వన్డే సిరీస్‌ను కూడా 2-1తో సొంతం చేసుకుంది.
శ్రీలంకకు చేదు అనుభవం
అయితే, టీ20 సిరీస్‌లో మాత్రం శ్రీలంకకు చేదు అనుభవం మిగిలింది. తొలి మ్యాచ్‌లో గెలిచిన చరిత్ అసలంక బృందం.. రెండో టీ20లో ఓడింది. తాజాగా కొలంబో వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లోనూ ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది.
ఆర్. ప్రేమదాస స్టేడియంలో బుధవారం జరిగిన ఆఖరి పోరులో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో ఆతిథ్య శ్రీలంకను ఓడించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.
ఓపెనర్ నిసాంక (39 బంతుల్లో 46; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... షనక (25 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) విలువైన పరుగులు చేశాడు. కెప్టెన్ అసలంక (3), దినేశ్ చండీమల్ (4), కుశాల్ పెరీరా (0), కుశాల్ మెండిస్ (6) విఫలమయ్యారు.
బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ 4 ఒవర్లలో కేవలం 11 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 16.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 133 పరుగులు చేసింది.
తన్జీద్ హసన్ (47 బంతుల్లో 73 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో రాణించగా... కెప్టెన్ లిటన్ దాస్ (32; 2 ఫోర్లు, 1 సిక్స్), తౌహిద్ హృదయ్ (27 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) అతడికి సహకరించారు. లంక బౌలర్లలో నువాన్ తుషార, కమిందు మెండిస్ చెరో వికెట్ పడగొట్టారు. మెహదీ హసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, లిటన్ దాస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.
మెహదీ హసన్ సరికొత్త చరిత్ర
కాగా తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం పదకొండు పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చిన స్పిన్ బౌలర్ మెహదీ హసన్.. కొలంబోలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఇంత వరకు ఈ రికార్డు టీమిండియా మాజీ స్టార్ హర్భజన్ సింగ్ పేరిట ఉండేది. 2012 వరల్డ్‌కప్ సందర్భంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భజ్జీ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 12 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు.
కొలంబోలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన పర్యాటక జట్టు బౌలర్లు
👉మెహదీ హసన్ (బంగ్లాదేశ్)- శ్రీలంక మీద 4-1-11-4, జూలై 2025
👉హర్భజన్ సింగ్ (ఇండియా)- ఇంగ్లండ్ మీద 4-2-12-4, సెప్టెంబరు 2012
👉జోష్ హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా)- శ్రీలంక మీద 4-0-16-4, జూన్ 2022
👉జో డెన్లీ (ఇంగ్లండ్)- శ్రీలంక మీద 4-0-19-4 , అక్టోబరు 2018
👉ముస్తాఫిజుర్ రహ్మాన్ (బంగ్లాదేశ్)- శ్రీలంక మీద 3-0-21-4, ఏప్రిల్ 2017
👉భువనేశ్వర్ కుమార్ (ఇండియా)- శ్రీలంక మీద 3.3-0-22-4, జూలై 2021
👉శార్దూల్ ఠాకూర్(ఇండియా)- శ్రీలంక మీద 4-0-27-4, మార్చి 2018.
చదవండి: ‘బుమ్రా ఆడనప్పుడే.. టీమిండియా ఎక్కువ మ్యాచ్‌లు గెలిచింది’