‘బుమ్రా ఆడినపుడే.. టీమిండియా ఓడిపోతుంది’ | India Lose More When Bumrah Plays: Ex England Star Sensational Comments | Sakshi
Sakshi News home page

‘బుమ్రా ఆడినపుడే.. టీమిండియా ఓడిపోతుంది’

Jul 17 2025 12:21 PM | Updated on Jul 17 2025 1:55 PM

India Lose More When Bumrah Plays: Ex England Star Sensational Comments

ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ డేవిడ్‌ లాయిడ్‌ వ్యాఖ్యలు

ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో ఓటమి పాలైన టీమిండియా.. మాంచెస్టర్‌లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. లార్డ్స్‌లో జరిగిన ఉత్కంఠ పోరులో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని.. సిరీస్‌ను 2-2తో సమం చేయాలని భావిస్తోంది.  అయితే, ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) ఆడతాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

కాగా ఇంగ్లండ్‌ పర్యటనకు ముందే బుమ్రా పనిభారం గురించి చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ (Ajit Agarkar), హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమ పేస్‌దళ నాయకుడిపై భారాన్ని తగ్గించేందుకు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో.. అతడు కేవలం మూడింటిలో మాత్రమే ఆడతాడని వీరు స్పష్టం చేశారు.

నో క్లారిటీ
ఇందుకు తగ్గట్లుగానే లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఆడిన బుమ్రా.. ఎడ్జ్‌బాస్టన్‌ మ్యాచ్‌ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. మళ్లీ లార్డ్స్ టెస్టుతో తిరిగి వచ్చిన ఈ రైటార్మ్‌ పేసర్‌.. తదుపరి మాంచెస్టర్‌లో ఆడతాడా? లేదా? అన్న అంశంపై మేనేజ్‌మెంట్‌ ఇంతవరకు స్పష్టతనివ్వలేదు.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ డేవిడ్‌ లాయిడ్‌ బుమ్రాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడొక ప్రపంచస్థాయి బౌలర్‌ అంటూనే.. బుమ్రా ఆడిన మ్యాచ్‌లలో టీమిండియాకు ఎక్కువసార్లు ఓటమే ఎదురైందని పేర్కొన్నాడు. అతడు లేనప్పుడే చిరస్మరణీయ విజయాలు అందుకుందని విమర్శించాడు.

టీమిండియా గెలిస్తే ఐదో టెస్టు ఆడతాడా?
‘‘ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల్లో బుమ్రా కేవలం మూడే ఆడతాడని కోచ్‌ గౌతం గంభీర్‌ స్వయంగా చెప్పాడు. అతడు ఇప్పటికి రెండు మ్యాచ్‌లు ఆడాడు. సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక్క టెస్టు మాత్రమే అతడు ఆడతాడన్నది తెలిసిందే.

ఒకవేళ మేనేజ్‌మెంట్‌ తమ మాటకు కట్టుబడి ఉంటే.. అతడిని నాలుగో టెస్టులో ఆడిస్తుందా? లేదంటే.. సిరీస్‌ ప్రాధాన్యత దృష్ట్యా ఐదో టెస్టులోనూ ఆడించాలని కోరుకుంటుందా?.. ఒకవేళ అతడు తదుపరి ఓల్డ్‌ ట్రఫోర్ట్‌ టెస్టులో ఆడి.. టీమిండియా గెలిస్తే అప్పుడు 2-2తో సిరీస్‌ సమం అవుతుంది.

కాబట్టి సిరీస్‌ విజేతను తేల్చే నిర్ణయాత్మకమైన ఐదో టెస్టులో అతడిని ఆడించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అలా కాకుండా నాలుగో టెస్టులో టీమిండియా ఓడి 3-1తో సిరీస్‌ కోల్పోతే.. ఇక ఆఖరి టెస్టుకు అతడి అవసరం ఉండదని అనుకోవచ్చు.

బుమ్రా జట్టులోనే ఉంటేనే ఓటమి?!
ఇదొక అసాధారణ అంశం. ఏదేమైనా.. అతడు ఆడిన మ్యాచ్‌లలో టీమిండియా గెలిచిన సందర్భాల కంటే.. ఓడిన దాఖలాలే ఎక్కువని అంటూ ఉంటారు. అతడొక వరల్డ్‌క్లాస్‌ బౌలర్‌. అతడి బౌలింగ్‌ శైలి కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. ఉత్తమ బౌలరే అయినా.. అతడి విషయంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి’’ అంటూ లాయిడ్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.

కాగా 2018లో బుమ్రా టెస్టుల్లో అరంగేట్రం చేసి.. ఇప్పటికి 47 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో టీమిండియా 20 గెలవగా.. 23 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో బుమ్రా మొత్తంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. కానీ ఇందులో గిల్‌ సేన ఓటమిపాలైంది. ఇక రెండో టెస్టుకు అతడు దూరంగా ఉండగా ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌ను ఏకంగా 336 పరుగుల తేడాతో ఓడించి ఈ వేదికపై తొలిసారి గెలుపు రుచిచూసింది.

ఇక మూడో టెస్టుతో తిరిగి వచ్చిన బుమ్రా మరోసారి ఐదు వికెట్ల ప్రదర్శన (మొత్తం ఏడు వికెట్లు)తో సత్తా చాటాడు. కానీ ఈ మ్యాచ్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఇక భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానంలో నాలుగో టెస్టు (జూలై 23-27) జరుగనుంది.

చదవండి: జట్టు మారనున్న ఆర్సీబీ స్టార్‌ జితేశ్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement