
తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును (ఆర్సీబీ) ఛాంపియన్‌గా నిలపడంతో కీలకపాత్ర పోషించిన జితేశ్ శర్మ.. రానున్న దేశవాలీ సీజన్ కోసం జట్టు మారనున్నాడు. అరంగేట్రం నుంచి గత సీజన్ వరకు విదర్భకు ప్రాతినిథ్యం వహించిన జితేశ్.. వచ్చే సీజన్ నుంచి బరోడాకు ఆడనున్నాడు.
గత రంజీ సీజన్‌లో (2024-25) మొత్తం బెంచ్‌కే పరిమితం కావడంతో జితేశ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. జట్టు మారే విషయంలో జితేశ్‌ను బరోడా కెప్టెన్, ఆర్సీబీ సహచరుడు కృనాల్ పాండ్యా ప్రభావితం చేసినట్లు తెలుస్తుంది.
విదర్భ తరఫున పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు మాత్రమే పరిమితమైన జితేశ్.. రెడ్ బాల్ ఫార్మాట్‌లో సత్తా చాటాలని అనుకుంటున్నాడు. ఇందుకు అతనికి సరైన అవకాశాలు కావాలి. అయితే విదర్భలో ఇది జరగడం లేదు. అందుకే అతను బరోడాకు మారాలని నిర్ణయించుకున్నాడు. విదర్భలో జితేశ్‌కు బదులు అక్షయ్ వాద్కర్‌కు అవకాశాలు ఎక్కువగా దొరికేవి.
రైట్ హ్యాండ్ వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన జితేశ్.. 2015-16 సీజన్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసినప్పటికీ ఇప్పటివరకు కేవలం 18 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇందులోనూ అతని ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ మ్యాచ్‌ల్లో జితేశ్ 24.48 సగటున కేవలం 661 పరుగులు మాత్రమే చేశాడు.
జితేశ్ పరిమిత ఓవర్ల కెరీర్ (దేశవాలీ) విషయానికొస్తే.. అతను ఇప్పటివరకు 56 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 141 టీ20లు ఆడాడు. ఇందులో 3 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీల సాయంతో 4419 పరుగులు చేశాడు. 31 ఏళ్ల జితేశ్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో అత్యుత్తమంగా రాణించాడు. ఈ సీజన్‌లో అతను 176.35 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించి, ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.
మరో ఆర్సీబీ ఆటగాడు కూడా..!
దేశవాలీ క్రికెట్‌లో మరో ఆర్సీబీ ఆటగాడు కూడా జట్టు మారనున్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లో బెంచ్‌కే పరిమితమైన స్వప్నిల్ సింగ్.. రానున్న దేశవాలీ సీజన్ కోసం ఉత్తరాఖండ్ నుంచి త్రిపురకు మారనున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన స్వప్నిల్.. ఉత్తరాఖండ్ తరఫున 5 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 18 వికెట్లు తీశాడు.