
సూర్యతో అగార్కర్ (PC: BCCI)
క్రికెట్ ప్రేమికులకు మరోసారి మజా అందించేందుకు ఆసియా కప్ (Asia Cup 2025) టోర్నమెంట్ సిద్ధంగా ఉంది. యూఏఈ వేదికగా ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహణకు సెప్టెంబరు 9- 28 వరకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈ ఖండాంతర టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి.
ఆరోజే భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్!
గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ తలపడనుండగా.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పోటీపడనున్నాయి. ఒకే గ్రూపులో ఉన్న దాయాదులు భారత్- పాక్ (India vs Pakistan) జట్లు ఈ టోర్నీ లీగ్ దశలో సెప్టెంబరు 14న తొలిసారి తలపడతాయి. ఆ తర్వాత సూపర్ 4, ఫైనల్ కలుపుకొని మరో రెండుసార్లు పరస్పరం ఢీకొట్టే అవకాశం లేకపోలేదు.
ఆ మ్యాచ్ రద్దు
అయితే, ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత్- పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌తో క్రీడల్లోనూ ఎలాంటి బంధం కొనసాగించవద్దనే డిమాండ్లు పెరిగాయి. ఇటీవల వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లోనూ ఇండియా చాంపియన్స్.. పాకిస్తాన్‌తో ఆడేందుకు విముఖత చూపింది.
లీగ్, సెమీ ఫైనల్ మ్యాచ్‌ను బహిష్కరించి.. దేశమే తమకు ముఖ్యమని మాజీ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు తేల్చిచెప్పింది. అయితే, ఆసియా కప్ టోర్నీలో మాత్రం చిరకాల ప్రత్యర్థులు కచ్చితంగా ముఖాముఖి పోటీపడే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈ విషయం గురించి టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు తాజాగా ప్రశ్న ఎదురైంది. ఆసియా కప్-2025 టోర్నీ కోసం మంగళవారం భారత జట్టును ప్రకటించారు. ఈ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి అగార్కర్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.
అగార్కర్‌కు ప్రశ్న.. బీసీసీఐ రియాక్షన్ ఇదే
ఈ క్రమంలో ఓ విలేఖరి.. ‘‘సెప్టెంబరు 14న ఆసియా కప్ టోర్నీలో బిగ్ మ్యాచ్ ఉంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఇరుదేశాల మధ్య గత రెండు నెలలుగా ఏం జరుగుతుందో మనకి తెలుసు. మరి ఈ మ్యాచ్ విషయంలో మీ వైఖరి ఏమిటి?’’ అని ప్రశ్నించారు.
ఇందుకు అగార్కర్ బదులిచ్చేందుకు సిద్ధమవుతుండగా.. బీసీసీఐ మీడియా మేనేజర్ అతడికి అడ్డుపడ్డారు. ‘‘ఆగండి.. కాస్త ఆగండి. జట్టు ఎంపిక గురించిన ప్రశ్నలు మాత్రమే అడగండి’’ అంటూ సమాధానం దాటవేసేలా చేశారు. దీంతో మరోసారి భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఆసియా కప్ టీ20-2025 టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టు
సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.
రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.
చదవండి: Asia Cup 2025: అందుకే శ్రేయస్‌ను సెలక్ట్ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్