
బంగ్లాదేశ్ దిగ్గజ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్‌కు (36) ఇవాళ (మార్చి 23) ఉదయం గుండెపోటు వచ్చింది. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ఆడుతుండగా తమీమ్ తీవ్రమైన ఛాతీ నొప్పికి గురయ్యాడు. దీంతో అతన్ని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తమీమ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం అతనికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. తమీమ్ గుండె ధమనాల్లో పూడికలు ఉన్నట్లు తెలుస్తుంది. తమీమ్ ఇవాళ ఉదయమే రెండు సార్లు ఛాతీ నొప్పికి గురైనట్లు సమాచారం. తమీమ్ పరిస్థితి తెలిసి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ కార్యకలాపాలన్నిటినీ వాయిదా వేసుకుంది. బోర్డు డైరెక్టర్లు తమీమ్‌ను చూసేందుకు ఆసుపత్రికి క్యూ కట్టారు.
తమీమ్ బంగ్లాదేశ్ క్రికెట్‌లో అత్యంత సఫలమైన ఆటగాడు. తమీమ్ 2023లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం అతను లోకల్ క్రికెట్ ఆడుతూ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు. తమీమ్ పేరిట బంగ్లాదేశ్ క్రికెట్‌కు సంబంధించి ఎన్నో రికార్డులు ఉన్నాయి.
తమీమ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో (మూడు ఫార్మాట్లలో) 15000 పైచిలుకు పరుగులు సాధించాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో ఇన్ని పరుగులు ఎవరూ చేయలేదు. తమీమ్ బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు కలిగి ఉన్నాడు. తమీమ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 25 సెంచరీలు బాదాడు. తమీమ్ 2020-2023 వరకు బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.