సంచలన విజయం దిశగా జింబాబ్వే | BAN VS ZIM 1st Test: Zimbabwe Heading Towards Sensational Victory | Sakshi
Sakshi News home page

సంచలన విజయం దిశగా జింబాబ్వే

Apr 23 2025 3:44 PM | Updated on Apr 23 2025 5:22 PM

BAN VS ZIM 1st Test: Zimbabwe Heading Towards Sensational Victory

రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న జింబాబ్వే క్రికెట్‌ జట్టు.. సిల్హెట్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో సంచలన విజయం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే గెలుపుకు మరో 57 పరుగుల దూరంలో ఉంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే గెలిస్తే ఆరేళ్ల తర్వాత బంగ్లా గడ్డపై విజయం సాధించినట్లవుతుంది. చివరిగా జింబాబ్వే 2018 నవంబర్‌లో బంగ్లాదేశ్‌ను వారి సొంతగడ్డపై ఓడించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. జింబాబ్వే బౌలర్లు రెచ్చిపోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కుప్పకూలింది. ముజరబానీ, వెల్లింగ్టన్‌ మసకద్జ తలో 3.. న్యాయుచి, మదెవెరె చెరో 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్‌  దెబ్బకొట్టారు. బంగ్లాదేశ్‌కు సొంతగడ్డపై ఇది నాలుగో అత్యల్ప స్కోర్‌.

బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్‌ హక్‌ (56) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్‌ నజ్ముల్‌ హసన్‌ షాంటో (40), జాకిర్‌ అలీ (28), మహ్మదుల్‌ హసన్‌ రాయ్‌ (14), షద్మాన్‌ ఇస్లాం (12), హసన్‌ మహమూద్‌ (19) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్‌ ప్లేయర్‌ ముష్ఫికర్‌ రహీం 4, మెహిది హసన్‌ మిరాజ్‌ 1, తైజుల్‌ ఇస్లాం 3, నహిద్‌ రాణా డకౌటయ్యారు. 

అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్‌ బ్రియాన్‌ బెన్నెట్‌ (57), సీన్‌ విలియమ్స్‌ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. వికెట్‌కీపర్‌ న్యాషా మయవో (35), వెస్లీ మెదెవెరె (24), రిచర్డ్‌ నగరవ (28 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

మిగతా బ్యాటర్లలో బెన్‌ కర్రన్‌ 18, నిక్‌ వెల్చ్‌ 2, కెప్టెన్‌ క్రెయిగ్‌ ఎర్విన్‌ 8, వెల్లింగ్టన్‌ మసకద్జ 6, ముజరబానీ 17, న్యాయుచి 7 పరుగులకు ఔటయ్యారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో మెహిది హసన్‌ మిరాజ్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. నహిద్‌ రాణా 3, హసన్‌ మహమూద్‌, ఖలీద్‌ అహ్మద్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

82 వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ మరోసారి పేలవ ప్రదర్శన కనబర్చి 255 పరుగులకు ఆలౌటైంది. దీంతో జింబాబ్వే ముందు కేవలం 174 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. స్వల్ప లక్ష్య ఛేదనలో జింబాబ్వే అద్భుతంగా ఆడుతూ విజయం దిశగా సాగుతుంది. 

నాలుగో రోజు టీ విరామం సమయానికి జింబాబ్వే గెలుపుకు 57 పరగుల దూరంలో ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో జింబాబ్వే స్కోర్‌ 117/2గా ఉంది. బ్రియాన్‌ బెన్నెట్‌ (52), సీన్‌ విలియమ్స్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement