సిల్హెట్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఘన విజయం దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఐర్లాండ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. ఐరీష్ జట్టు బంగ్లా కంటే ఇంకా 215 పరుగులు వెనకబడి ఉంది.
రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి ఐర్లాండ్ టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్(43) కాసేపు నిలకడగా ఆడాడు. మిగితా బ్యాటర్లంతా వచ్చినవారు వచ్చినట్లగానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. బంగ్లా బౌలర్లలో ఇప్పటివరకు హసన్ మురాద్ రెండు వికెట్లు పడగొట్టగా.. నహిద్ రాణా, తైజుల్ ఇస్లాం తలా వికెట్ సాధించారు.
స్టిర్లింగ్ రనౌటయ్యాడు. ఇక బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 587/8 భారీ స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసింది. బంగ్లాదేశ్ ఓపెనర్ మహముదుల్ హసన్ జాయ్(171 పరుగులు), కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ షాంటో(100) శతకాలతో కదం తొక్కగా.. షాద్‌మన్ ఇస్లామ్( 80 పరుగులు), మోమినుల్ హక్(82) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఐర్లాండ్ యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మాథ్యూ హంఫ్రీస్ ఫైవ్ వికెట్ల హాల్‌తో సత్తాచాటాడు. అంతకుముందు ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. వెటరన్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (60), కేడ్ కార్మిచల్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. కర్టిస్ క్యాంఫర్ (44), లోర్కాన్ టకర్ (41), జోర్డన్ నీల్ (30), బ్యారీ మెక్‌కార్తీ (31) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఇన్నింగ్స్ తేడాతో ఓటమి నుంచి తప్పించుకోవాలంటే ఏదైనా అద్బుతం జరగాలి.
చదవండి: ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ.. భారత తుది జట్టు ఇదే


