
ఆసియా కప్ టీ20- 2025 టోర్నమెంట్ ముగింపు దశకు చేరుకుంటోంది. సూపర్-4 దశలో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ శ్రీలంక (BAN vs SL)పై నాలుగు వికెట్ల తేడాతో గట్టెక్కగా.. టీమిండియా పాకిస్తాన్ (IND vs PAK)ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
ఇక తాజాగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్.. శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా ఫైనల్ చేరే అవకాశాలను సజీవం చేసుకుంది. మరోవైపు.. ఇప్పటికే సూపర్-4లో బంగ్లా చేతిలో ఓడిన శ్రీలంక.. తాజాగా పాక్ చేతిలోనూ ఓడి ఫైనల్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది.
అయితే, ఇతర జట్ల ఫలితాల ఆధారంగా లంక జట్టుకు ఇంకా దింపుడుకళ్లెం ఆశలు మిగిలి ఉన్నట్లే!.. ఈ నేపథ్యంలో టైటిల్ పోరుకు అర్హత సాధించేందు (Asia Cup 2025 Final Scenarios)కు నాలుగు జట్లకు అవసరమైన సమీకరణలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం!
ఫైనల్ రేసు.. ఏ జట్లకు అవకాశాలు ఎక్కువ?
సూపర్-4లో టీమిండియా తొలి మ్యాచ్‌లో పాక్‌పై గెలిచి రెండు పాయింట్లు సాధించింది. నెట్ రన్‌రేటు పరంగానూ(+0.689) మెరుగ్గా ఉండటం వల్ల ప్రస్తుతం టాపర్‌గా ఉంది. ఇక పాకిస్తాన్ రెండింట ఒక విజయంతో రెండు పాయింట్లతో.. +0.226 నెట్ రన్‌రేటుతో రెండో స్థానంలో ఉంది.
మరోవైపు.. బంగ్లాదేశ్ ఒక విజయంతో రెండు పాయింట్లు (+0.121) సాధించి మూడో స్థానంలో ఉండగా.. లంక రెండింటికి రెండు ఓడి ఆఖరి ప్లేస్‌లో నిలిచింది.
టీమిండియాకు నల్లేరు మీద నడకే
ఇక బుధవారం నాటి మ్యాచ్‌లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్‌తో తలపడనుంది. టీ20 ఫార్మాట్లో ఇరుజట్లు ముఖాముఖి ఎదురుపడిన సందర్భాల్లో భారత్ 16 సార్లు గెలుపొందగా.. బంగ్లా ఒకే ఒక్కసారి విజయం సాధించింది. కాబట్టి ఈ మ్యాచ్ ఫలితాన్ని తేలికగానే అంచనా వేయవచ్చు.
బంగ్లాపై గెలిస్తే భారత్ ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరతాయి. ఆ తర్వాత శ్రీలంకను కూడా ఓడిస్తే.. టీమిండియా అజేయంగా ఫైనల్‌కు చేరుకుంటుంది. మరోవైపు.. పాకిస్తాన్ తమకు మిగిలిన ఒక్క మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను తప్పక ఓడించాల్సి ఉంటుంది. లేదంటే పాక్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి.
అలాంటపుడు టీమిండియా చేతిలో బంగ్లా ఓడినప్పటికీ.. పాక్, బంగ్లాలు పాయింట్ల పరంగా సమమవుతాయి. అప్పుడు నెట్ రన్ రేటుది కీలక పాత్ర. అలా కాకుండా.. పాక్ బంగ్లాపై గెలవడంతో పాటు.... టీమిండియా బంగ్లా, లంకలను ఓడించిందంటే.. పాక్ కూడా టైటిల్ పోరుకు నేరుగా అర్హత సాధిస్తుంది.
ఇది టీ20 ఫార్మాట్ గురూ!
ఒకవేళ ఊహించని రీతిలో బంగ్లాదేశ్ గనుక టీమిండియాపై గెలిస్తే.. అదే విధంగా శ్రీలంక చేతిలో భారత జట్టు ఓడితే అప్పుడు పాక్‌తో పాటు బంగ్లాకు అవకాశాలు మిగిలి ఉంటాయి. ఇది దాదాపు అసాధ్యం. ప్రస్తుత టీమిండియా పటిష్టంగా ఉంది కాబట్టి.. ఇది జరగకపోవచ్చు.
ఏదేమైనా ఫైనల్ చేరే అవకాశాలు టీమిండియా, పాకిస్తాన్‌లకే ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఇది టీ20 ఫార్మాట్ కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము. అయితే, చరిత్రను బట్టి భారత్- పాక్ ఫైనల్లో ఢీకొట్టుకునే అవకాశాలను మాత్రం కొట్టిపడేయలేము. ఇదిలా ఉంటే.. దాయాది పాక్‌ను లీగ్ దశలో, సూపర్-4లో టీమిండియా ఓడించిన విషయం తెలిసిందే.
మరి శ్రీలంక పరిస్థితి ఏమిటి?
శ్రీలంక ఫైనల్ రేసులోకి రావాలంటే.. బంగ్లాదేశ్.. టీమిండియా, పాకిస్తాన్‌లపై గెలవాలి. అంతేకాదు.. తమ ఆఖరి మ్యాచ్‌లో టీమిండియాపై శ్రీలంక భారీ తేడాతో విజయం సాధించాలి. అప్పుడే లంక ఆశలు మిగిలి ఉంటాయి.
చదవండి: వెక్కిరించిన పాక్ బౌలర్.. ఒకటి కాదు.. రెండుసార్లు ఇచ్చిపడేసిన హసరంగ