
టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన వికెట్‌కీపర్ బ్యాటర్‌గా అవతరించాడు. తాజాగా జరిగిన ఆసియా కప్ ఫైనల్లో సంజూ ఈ ఘనత సాధించాడు. ఎంఎస్ ధోని (MS Dhoni) పేరిట ఉండిన ఈ రికార్డును సంజూ తన పేరిట బదిలి చేసుకున్నాడు.
పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో (Asia Cup 2025) సంజూ ఓ సిక్సర్ కొట్టాడు. దీంతో కలుపుకొని టీ20ల్లో అతని సిక్సర్ల సంఖ్య 55కి చేరింది. కేవలం 48 ఇన్నింగ్స్‌ల్లోనే సంజూ ఈ సిక్సర్లను బాదాడు. ధోని విషయానికొస్తే.. అతని ఖాతాలో 54 టీ20 సిక్సర్లు ఉన్నాయి. ఈ విభాగంలో సంజూ, ధోని తర్వాతి స్థానంలో రిషబ్ పంత్ ఉన్నాడు. పంత్ ఖాతాలో 52 సిక్సర్లు ఉన్నాయి.
ఆసియా కప్‌లో సంజూ మరో ఘనత కూడా సాధించాడు. ఓ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత వికెట్‌కీపర్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీలో సంజూ మొత్తం 7 సిక్సర్లు బాదాడు. గతంలో ఈ రికార్డు ధోని, పంత్ పేరిట సంయుక్తంగా ఉంది. ధోని 2009 టీ20 వరల్డ్‌కప్‌లో, పంత్ 2024 టీ20 వరల్డ్‌కప్‌లో తలో 6 సిక్సర్లు బాదారు.
కాగా, ఆసియా కప్ 2025లో భారత్ విజేతగా అవతరించింది. ఫైనల్లో పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, 9వ సారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.
అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ సైతం తొలుత తడబడినప్పటికీ.. తిలక్ వర్మ (53 బంతుల్లో 69; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తిలక్‌కు సహకరించారు. రింకూ సింగ్ బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఈ టోర్నీలో భారత్ మొత్తం మూడు సార్లు పాక్‌ను ఓడించింది.
చదవండి: ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనం.. మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించిన పసికూన