
ఆసియాకప్-2025 ఫైనల్ మ్యాచ్ అనంతరం హైడ్రామా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. విజేతగా నిలిచిన భారత జట్టు ట్రోఫీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్, పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి నిరకారించింది.
టీమిండియా చర్యతో మొహ్సిన్ నఖ్వీకి ఘోర అవమానం ఎదురైంది. దీంతో నఖ్వీ ట్రోఫీని తనతో పాటు హోటల్‌కు తీసుకుని వెళ్లిపోయాడు. అతడి తీరుపై బీసీసీఐ తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. అయినా ఇప్పటికీ ఇంకా ట్రోఫీ భారత్ వద్దకు చేరలేదు.
అతడు ఆసియాకప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అందజేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అదేవిధంగా ఈ టోర్నీ అంతటా పాక్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు కరచాలనం కూడా చేయలేదు.
ఈ టోర్నీలో భారత్-పాక్ జట్ల మధ్య చోటు చేసుకున్న పరిణామాలపై దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఎబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించిన భారత జట్టు వైఖరిని డివిలియర్స్ తప్పు బట్టాడు. క్రీడలకు రాజకీయాలను దూరంగా ఉంచాలని అతడు కోరాడు.
"ఆసియాకప్ ట్రోఫీని ఏసీసీ చైర్మెన్ చేతుల మీదగా తీసుకోవడానికి టీమిండియా సముఖత చూపలేదు. అందుకు కారణం మనందరికి తెలుసు. కానీ నావరకు అయితే అది క్రీడలకు సంబంధించినది కాదు. క్రీడల నుంచి రాజకీయాలను పక్కన పెట్టాలి.
స్పోర్ట్స్‌ను మనం ప్రత్యేకంగా చూడాలి. పాలిటిక్స్‌తో ముడిపెట్టకూడదు. ఆసియాకప్‌లో చోటు చేసుకున్న పరిణామాలు నాకు చాలా బాధ కల్గించాయి. అయితే భవిష్యత్తులో ఈ సమస్యలను పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాను. ఇటువంటి సంఘటనలు క్రీడాకారులను మానసికంగా దెబ్బతీస్తాయి. నాకు ఇటువంటివి అస్సలు నచ్చవు. చివరికి వివాదాలతోనే ఆసియాకప్ ముగిసింది" అని ఏబీడీ తన యూట్యూబ్ ఛానల్‌లలో పేర్కొన్నాడు.
అదేవిధంగా ఛాంపియన్స్‌గా నిలిచిన భారత జట్టు ఈ సౌతాఫ్రికా లెజెండ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా చాలా పట్టిష్టంగా కన్పిస్తోందని, టీ20 ప్రపంచకప్-2026కు సిద్దంగా ఉందని అతడు కొనియాడాడు.
చదవండి: IND vs WI: టీమిండియాతో మ్యాచ్.. చందర్‌పాల్ తనయుడు అట్టర్ ప్లాప్