అఫ్గానిస్తాన్ అండర్-19 జట్టుతో జరిగే ముక్కోణపు సిరీస్‌కు బీసీసీఐ తమ జట్లను ప్రకటించింది. అండర్–19 భారత్ ‘ఎ’, భారత్ ‘బి’ జట్లు అఫ్గానిస్తాన్‌తో తలపడనున్నాయి. ఇండియా-ఎ జట్టుకు విహాన్ మల్హోత్రా సారథ్యం వహించనుండగా.. బి జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ ఆరోన్ జార్జ్ ఎంపికయ్యాడు. ఆరోన్ ఇటీవల ముగిసిన బీసీసీఐ అండర్–19 టోర్నీ ‘వినూ మన్కడ్ ట్రోఫీ’లో హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ టోర్నీ విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది.
ఆరోన్ గత కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. వినూ మన్కడ్ ట్రోఫీలో గత మూడేళ్లుగా ఆరోన్ జార్జ్ టాప్ స్కోరర్‌గా నిలుస్తూ వచ్చాడు. ఈ సీజన్‌లో అతను 2 సెంచరీలు సహా 373 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న అండర్–19 చాలెంజర్ ట్రోఫీలో కూడా అతను నిలకడగా రాణిస్తున్నాడు.
స్కూల్ క్రికెట్‌లో మంచి ప్రదర్శనతో మూడేళ్ల క్రితం హైదరాబాద్ అండర్–16 టీమ్‌లోకి వచ్చిన అతను విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆకట్టుకున్నాడు. ఇక 2022–23 సీజన్‌లో ఒక ట్రిపుల్ సెంచరీ సహా 511 పరుగులు సాధించడంతో ఆరోన్‌కు మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం అతను భవాన్స్ కాలేజీలో బీకామ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
భారత్‌కు ఆడటమే లక్ష్యం
‘ఏ స్థాయిలోనైనా భారత జట్టు తరఫున ఆడాలనేది నా కల. ప్రస్తుత నా ప్రదర్శన, లభిస్తున్న అవకాశాలు ఆ దిశగా తొలి అడుగుగా భావిస్తున్నా. అండర్–19లోకి వస్తే ఐపీఎల్ ఆడే అవకాశాలు కూడా మెరుగవుతాయి’ అని కేరళ మూలాలు ఉన్న ఆరోన్ పేర్కొన్నాడు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆరోన్ జార్జి వీలు చిక్కినపుడల్లా కొట్టాయంలో ఉంటున్న తన తాత, బామ్మ ఇళ్లకు వెళ్లి వస్తుంటాడు.
చదవండి: రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే?


