‘నన్నెవరూ పట్టించుకోలేదన్నారు.. అవన్నీ అవాస్తవాలు’ | 8 hazaar: Sanju Devi debunks videos leaving airport alone after gold medal | Sakshi
Sakshi News home page

‘నన్నెవరూ పట్టించుకోలేదన్నారు.. అవన్నీ అవాస్తవాలు’

Oct 7 2026 7:18 PM | Updated on Oct 7 2026 7:31 PM

8 hazaar: Sanju Devi debunks videos leaving airport alone after gold medal

PC: Instagram

భారత కబడ్డీ స్టార్‌ సంజూ దేవి తన గురించి జరుగుతున్న ప్రచారంపై స్పందించింది. తనను ఎవరూ తక్కువ చేసి చూడలేదని.. విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించిందని స్పష్టం చేసింది. అసలేం జరిగిందంటే.. ఆసియా క్రీడలు-2026 టోర్నీలో భారత మహిళల కబడ్డీ జట్టు స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే.

వరుసగా రెండోసారి చాంపియన్‌గా 
జపాన్‌ వేదికగా హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఇరాన్‌ జట్టును 37-34 పాయింట్ల తేడాతో ఓడించి.. వరుసగా రెండోసారి భారత్‌ చాంపియన్‌గా నిలిచింది. ఈ జట్టులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సంజూ దేవి కూడా సభ్యురాలు. కోర్బాలోని కేరకచర్‌ గ్రామానికి చెందిన సంజూ రాష్ట్రం తరఫున పసిడి నెగ్గిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కింది.

ఒంటరిగా బయటకు వెళ్తున్న వీడియోలు
అయితే, ఇంతటి ఘనత సాధించిన తర్వాత కూడా సంజూ దేవికి కనీస గుర్తింపు దక్కలేదంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. విమానాశ్రయంలో ఆమెను ఎవరూ పట్టించుకోలేదని.. కనీస గౌరవ, సత్కారాలు కూడా అందలేదంటూ.. సంజూ ఒంటరిగా బయటకు వెళ్తున్న వీడియోలను కొంతమంది నెటిజన్లు షేర్‌ చేశారు.

ఈ విషయంపై సంజూ దేవి తాజాగా స్పందించింది. ‘‘ఎయిర్‌పోర్టు బయట దాదాపు ఎనిమిది వేల మంది జనం ఉన్నారని తెలిసింది. కాబట్టి విమానాశ్రయం లోపలే మమ్మల్ని సత్కరించాలని అమెచ్యూర్‌ కబడ్డీ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (AKFI), స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (SAI) నిర్ణయించాయి.

ఘన స్వాగతం లభించింది
కానీ నన్ను ఎవరూ పట్టించుకోలేదంటూ కొన్ని వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఇందులో ఎలాంటి నిజం లేదు. AKFI, SAIలపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. ఆ ఆరోపణలను నేను ఖండిస్తున్నాను. మాకు ఘన స్వాగతం లభించింది. ఘనంగా సత్కరించారు’’ అని సంజూ దేవి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్‌ చేసింది. సత్కారం తర్వాత ఎవరి ఊళ్లకు వాళ్లు వెళ్లే క్రమంలో మాత్రమే ఒంటరిగా కనిపించానని స్పష్టం చేసింది.

కాగా ఆసియా క్రీడలు-2026లో భారత మహిళలు, పురుషుల కబడ్డీ జట్లు స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఈసారి భారత్‌కు 85 పతకాలే లభించాయి. ఇందులో 21 పసిడి, 27 వెండి, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. కాగా గత ఎడిషన్‌లో భారత్‌ 106 పతకాలు సాధించింది.

సంజూ దేవికి రూ. 51 లక్షల నజరానా
ఆసియా క్రీడల్లో పసిడి గెలిచిన తమ కబడ్డీ ప్లేయర్‌ సంజూ దేవిని ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణు సాయి రాయ్‌పూర్‌లో ఉన్న తన నివాసంలో సత్కరించారు. ఆమెకు రూ. 51 లక్షల నజరానా ప్రకటించారు. 

చదవండి: జట్టు ప్రకటన.. శాంసన్‌ సోదరులకు దక్కని చోటు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement