PC: KCA/X
రంజీ ట్రోఫీ 2026-2027 ఎడిషన్‌లో తొలి మ్యాచ్‌కు సంబంధించి కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ) తమ జట్టును ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. ఎలైట్ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో భాగంగా కేరళ తొలుత జార్ఖండ్‌తో తలపడనుంది. జంషెడ్‌పూర్ వేదికగా అక్టోబరు 11-14 మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది.
ఈ నేపథ్యంలో జార్ఖండ్‌తో మ్యాచ్‌కు కేసీఏ పద్దెనిమిది మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో శాంసన్ సోదరులకు మాత్రం చోటు దక్కలేదు. ఈ జట్టుకు కేరళ విధ్వంసకర వికెట్ కీపర్ బ్యాటర్ విష్ణు వినోద్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
కాగా రంజీ ఎడిషన్‌లో మహ్మద్ అజారుద్దీన్ గైర్హాజరీలోనూ విష్ణు వినోద్ కేరళ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక ఈ జట్టులో సచిన్ బేబీ, జలజ్ సక్సేనా వంటి సీనియర్లకు కూడా చోటు దక్కింది.
అందుకే నో ఛాన్స్?
టీమిండియా టీ20 స్టార్ సంజూ శాంసన్, అతడి అన్న సలీ శాంసన్‌కు ఈ రంజీ జట్టులో చోటు దక్కలేదు. సంజూ ప్రస్తుతం వెస్టిండీస్‌తో స్వదేశంలో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్న కారణంగా.. జార్ఖండ్‌తో మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. అయితే, సీజన్‌లో తదుపరి మ్యాచ్‌లో సంజూ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు.. సలీ శాంసన్ ఇంత వరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేయనేలేదు. ఈ 35 ఏళ్ల ఆటగాడు కేరళ తరఫున ఇప్పటికి కేవలం రెండు టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-2026 సీజన్‌లో కేరళ తరఫున బరిలోకి దిగాడు.
జార్ఖండ్‌తో రంజీ మ్యాచ్‌కు కేరళ జట్టు
విష్ణు వినోద్ (కెప్టెన్), రోహన్ కణ్ణుమ్మల్, అభిషేక్ జె. నాయర్, అభిషేక్ పి. నాయర్, సచిన్ బేబీ, అహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ అజారుద్దీన్ (వికెట్ కీపర్), సల్మాన్ నిజార్, వరుణ్ నాయనర్ (వికెట్ కీపర్), జలజ్ సక్సేనా, వైశాఖ్ చంద్రన్, ఆదిత్య ఆనంద్ సర్వాటే, అనురాజ్ జేఎస్, అభిజిత్ ప్రవీణ్ వి, నిధీశ్ ఎండీ, ఏడెన్ ఆపిల్ టామ్, పవన్ రాజ్, బాసిల్ ఎన్‌పీ.


