కొండపాక(గజ్వేల్): సర్టిఫికెట్లను ఇవ్వడంలో అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ శుక్రవారం విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. మండలంలోని వెలికట్ట శివారులో గల శ్రీకృప ఫార్మసీ కళాశాలలో ఫార్మసీ విద్య పూర్తయినా ఫీజు బకాయిలు ఉన్నాయంటూ యాజమాన్యం సర్టిఫికెట్లను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించే స్తోమత లేకనే ప్రభుత్వ కోటాలో కౌన్సిలింగ్ పద్ధతిలో కళాశాలలో చేరామని ఆవేదనకు గురయ్యారు. సర్టిఫికెట్లు లేకపోవడంతో పైచదువుల కోసం దరఖాస్తులు చేసుకోలేకపోతున్నామన్నారు. కళాశాలలో చేరినప్పుడు యాజమాన్యం తీసుకున్న ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఫార్మసీ విద్య పూర్తెనట్లుగా సర్టిఫికెట్‌ను అందించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు పడిన తర్వాతే సర్టిఫికెట్లను అందజేస్తామని చైర్మన్ మాట్లాడటం బాధాకరమన్నారు. ఈ విషయంపై చైర్మన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్ డబ్బులు విడుదల విషయమై ఈనెలలో జడ్జిమెంట్ రానుందని, దాని ఆధారంగా విద్యార్థుల సర్టిఫికెట్లను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


