మోగనున్న పెళ్లి బాజాలు
● రేపటి నుంచి సెప్టెంబర్ 11 వరకు..
● కళకళలాడనున్న కల్యాణ మండపాలు
● ఒక్కటి కానున్న జంటలు
● ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ సర్వీసులకు డిమాండ్
సంగారెడ్డి టౌన్/హత్నూర(సంగారెడ్డి ): శ్రావణమాసం వచ్చి శుభకార్యాలకు మంచిరోజులు తెచ్చింది. దాదాపు మూడు నెలల తర్వాత శుభ ముహూర్తాలు రానున్నాయి. ఆదివారం నుంచి వివాహ వేడుకలు మొదలు కానున్నాయి. ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ సర్వీసులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ శ్రావణంలో పెళ్లిళ్ల సందడి అధికంగా ఉండనుంది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో అభిషేకాలు, పవిత్రోత్సవాలు, ప్రత్యేక, కుంకుమ పూజలు నిర్వహించడానికి ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు.
పట్టణాల్లో పెళ్లిళ్ల షాపింగ్ ఊపందుకుంది. దుస్తులు, బంగారు ఆభరణాల కొనుగోలుకు వధూవరుల కుటుంబ సభ్యులు షాపింగ్ ప్రారంభించారు. వస్త్ర, నగల దుకాణాలు కళకళలాడుతున్నాయి. భోజనాలు, క్యాటరింగ్, కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్, డెకరేషన్ల కోసం ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. శుభలేఖలు, ఫ్లెక్సీ ప్రింటింగ్, ఫొటోగ్రాఫర్లు, టెంట్ హౌస్, వంట మేసీ్త్రలు, బ్యూటీషియన్లు, మెహందీ ఆర్టిస్టులు, బజంత్రీలు.. ఇలా పెళ్లి వేడుకతో ముడిపడిన ప్రతి ఒక్కరికీ పని మొదలైంది. ఆర్థికంగా ఉన్నవారు వివాహ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే వెడ్డింగ్ ప్లానర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. సాధారణ, మధ్య తరగతి వారు కూడా తమ స్థాయికి తగ్గట్లు వేడుకలకు సిద్ధమవుతున్నారు.
ఆధునిక సెట్టింగులు..
కల్యాణ మండపాల్లో కళ్లు చెదిరే సిట్టింగులు ఏర్పాటు చేస్తున్నారు. రూ.లక్షల్లో అద్దెలు పలుకుతున్నా. ఆ సంబరమే వేరని వధూవరుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా మండపాలను తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
మంగళవాయిద్యాలకు గిరాకీ
హిందూ సంప్రదాయంలో మంగళవాయిద్యాలు లేకుండా పెళ్లి వేడుక ఉండదు. నూతన వధూవరులను సిద్ధం చేసే సమయం నుంచి పెళ్లి పూర్తయి ఇంటికి వచ్చే వరకు మంగళవాయిద్యాలు తప్పనిసరి. బ్యాండు మేళాలు, ఆర్కెస్ట్రాలకు రూ.50 వేల నుంచి రూ. లక్షకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఇక విందు భోజనాల సంగతి సరేసరి. ఎంత ఖర్చు పెట్టేందుకై నా వెనుకాడటం లేదు. ఎంచుకున్న మెనూను బట్టి ప్లేట్‌కు ఇంతని ధర నిర్ణయిస్తారు. వివాహాలు చేయి ంచే పురోహితులకు మంచి డిమాండ్ పెరిగింది.


