జొన్న రైతు పంట పండింది | - | Sakshi
Sakshi News home page

జొన్న రైతు పంట పండింది

Aug 15 2026 7:29 AM | Updated on Aug 15 2026 7:29 AM

రూ.184.16 కోట్లు చెల్లించిన సర్కార్‌

● గతానికి భిన్నంగా భారీగా కొనుగోళ్లు ● మార్కెట్‌ కంటే రెట్టింపు మద్దతు ధర

నారాయణఖేడ్‌: జొన్న రైతుకు పంట పండింది. గతానికి భిన్నంగా ప్రభుత్వం భారీగా జొన్నలు కొనుగోళ్లు చేపట్టి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. కొనుగోళ్లు పూర్తయిన రెండు నెలల్లోపు రైతుల వారి వారి ఖాతాల్లో రూ.184.16 కోట్లను జమ చేశారు. జొన్న రైతుల నుంచి కనీస మద్దతు ధర రూ.3,699కు క్వింటాలుకు కొనుగోళ్లు చేపట్టింది. మార్కెట్‌ హెచ్చు తగ్గుల వల్ల రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా కొనుగోళ్లను సైతం వేగవంతం చేసింది. మార్కెట్‌లో క్వింటాలుకు రూ.2వేల లోపే ధర పలుకగా కొనుగోలు కేంద్రాల్లో మంచి మద్దతు ధర లభించింది. జిల్లా మొత్తంలో 30 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 21,159 మంది రైతులకు సంబంధించి రూ.184.16 కోట్ల విలువగల 49,775.6 మెట్రిక్‌ టన్నుల జొన్నలను కొనుగోలు చేశారు.

భారీగా జొన్న సాగు

యాసంగి సీజన్‌లో జిల్లాలో 91వేల ఎకరాల పైగా జొన్న పంటను సాగు చేశారు. దిగుబడులు కూడా అనుకూలంగా వచ్చాయి. నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, ఆందోల్‌, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లోని గ్రామాల వ్యవసాయ క్షేత్రాలు జొన్న పంట సాగుకు అనుకూలంగా ఉండటంతో దిగుబడులు కూడా భారీగానే వస్తున్నాయి. ఎకరాకు కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చాయి. రైతులు తాము కుటుంబ అవసరాలకు కొంత దాచుకోగా మిగతా పంటను మద్దతు ధరకు ప్రభుత్వానికి విక్రయించారు. గతంలో కొనుగోలు చేసిన పంటలకు బిల్లుల చెల్లింపులు ఆలస్యం కాగా ఈ సారి మాత్రం రెండు నెలల్లోపు పూర్తి స్థాయిలో చెల్లింపులు జరిగాయి. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఖేడ్‌ డివిజన్‌లో అత్యధికంగా 12 జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా జహీరాబాద్‌లో 5, జొగిపేటలో 8, సంగారెడ్డిలో 5 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి విడతగా రూ.67 కోట్లు విడుదల కాగా, రెండో విడతలో రూ.40 కోట్లు చివరి విడతలో రూ.77 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో రైతులందరికీ జొన్నల బకాయిలు చెల్లింపులు పూర్తి చేసి వారి వారి ఖాతాల్లో జమ చేసినట్లు మార్క్‌ఫెడ్‌ డీఎం రంజిత్‌రెడ్డి తెలిపారు.

జిల్లాలో కొనుగోళ్ల తీరు..

సంవత్సరం కేంద్రాలు ఎంఎస్‌పీ రైతులు మెట్రిక్‌ టన్నులు రూ.కోట్లలో

2023–24 19 రూ.3,180 11066 21811 రూ.69.35

2024– 25 22 రూ.3,371 13224 31753 రూ.107.03

2025– 26 30 రూ.3,699 21159 49775 రూ.184.16

కొనుగోళ్ల

కేంద్రంలో జొన్న సంచులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement