యూరియా బుకింగ్‌ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

యూరియా బుకింగ్‌ కష్టాలు

Aug 15 2026 7:29 AM | Updated on Aug 15 2026 7:29 AM

చిన్నశంకరంపేట(మెదక్‌): యూరియా బుక్‌ చేసుకునేందుకు రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని జంగరాయి గ్రామంలో శుక్రవారం యూరియా బుక్‌ చేసుకునేందుకు అన్నదాతలు పడుతున్న పాట్లు అంతాఇంతా కాదు. తీరా యాప్‌ ఓపెన్‌ అయిన నిమిషం లోపే 1790 బస్తాల యూరియా బుక్‌ అయి యాప్‌లో నిల్‌ చూపడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం చిన్నశంకరంపేట, జంగరాయి పీఏసీఎస్‌లకు 560 బస్తాల చొప్పున, గవ్వలపల్లిలోని శ్రీరామలింగమేశ్వర ఫర్టిలైజర్‌ షాప్‌కు 670 బస్తాల యూరియా వచ్చింది. ఉదయం 10 గంటలకు ప్రేమ్‌ వర్క్‌ ఫార్మర్‌ యాప్‌లో యూరియా బుక్‌ చేసుకోవాలని ఏఓ ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు. అయితే యాప్‌ ఓపెన్‌ అయినా ఒక నిమిషంలోపే బస్తాలు అన్ని అయిపోయి యాప్‌లో నిల్‌ చూపడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించే యువకులే క్షణాల్లో యూరియా బుక్‌ చేసేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఇక ఉపయోగించడం రాని రైతులు రైతువేదికల వద్ద, ఫర్టిలైజర్‌ దుకణాల వద్ద ఇతరుల సహాయం కోసం ఎదురు చూశారు.

అవసరం 38 వేలు.. వచ్చింది 13 వేలు

చిన్నశంకరంపేట మండలంలో 19 వేల ఎకరాల్లో వరి సాగు చేశారని, ఇందుకు 38 వేల యూరియా బస్తాలు అవసరమని ఏఓ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. అయితే ఇప్పటి వరకు 13 వేల యూరియా బస్తాలు మాత్రమే వచ్చాయని, త్వరలోనే మరిన్ని బస్తాలు వస్తాయని చెప్పారు. రైతులు ముందుగా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కోరారు.

క్షణాల్లో అయిపోతున్న వైనం

ఆందోళన చెందుతున్న రైతన్నలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement