రామాయంపేట(మెదక్): కరెంటు షాక్‌తో ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం మండలంలోని లక్ష్మాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కాట్రియాల గ్రామానికి చెందిన మైలారం వెంకటయ్య(48) రైతు మృతదేహం ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో పడి ఉండగా సమీప రైతులు గుర్తించారు. అతని వంటిపై ఉన్న గాయాలను బట్టి కరెంటు షాక్‌తో మృతి చెంది ఉంటాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ బాల్‌రాజు తెలిపారు.
చికిత్స పొందుతూ మహిళ..
చేర్యాల(సిద్దిపేట): పాము కాటుకు గురైన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని ఆకునూరులో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బత్తుల పద్మ(55) ఈ నెల 8న వ్యవసాయ పొలంలో పనులు చేస్తున్న క్రమంలో పాము కాటుకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో గురువారం రాత్రి మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


