పెద్దశంకరంపేట(మెదక్): పెద్దశంకరంపేట మండల ప్రథమ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు తమ సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. శివాయిపల్లి,చీలాపల్లి, కమలాపూర్, ఆరేపల్లి, రామోజిపల్లి,గొట్టిముక్కుల,బూర్గుపల్లి తదితర గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలపై సర్పంచ్‌లు విద్యుత్‌శాఖ ఏఈ, లైన్‌మెన్‌లు,సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సంజీవరెడ్డి విద్యుత్ ఎస్‌ఈతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. గ్రామాల్లో ఇంకుడుగుంతల నిర్మాణం, జలసిరి, చెత్తసేకరణపై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచించారు. బుజ్రాన్‌పల్లి గ్రామానికి ఏడు నెలలుగా మిషన్‌భగీరథ రావడం లేదని సర్పంచ్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
కల్యాణలక్ష్మి,సీఎంఆర్‌ఎఫ్‌ల చెక్కుల పంపిణీ
మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన 23 మందికి కల్యాణలక్ష్మి, 63 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ల చెక్కులను ఎమ్మెల్యే సంజీవరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి జగదీశ్,ఎంపీడీఓ క్రాంతికుమార్, తహసీల్దార్ నారాయణ, హౌసింగ్ డీఈ విజయ, నాయకులు నారా గౌడ్, మధు, మురళిపంతులు, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పెరుమాండ్లుగౌడ్ తదితరులున్నారు.


