పాపన్నపేట(మెదక్): గిరిజన తండాలో మానవత్వం పరిమళించింది. ఓ చిన్నారి చేయి తొలగించాల్సిన పరిస్థితి రావడంతో .. తలా కొంత నగదు పోగు చేసి, మెరుగైన వైద్యం చేయించారు. దీంతో ప్రమాదం నుంచి అతడు బయటపడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని కశ్నా తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన గోపాల్,సుగుణ దంపతుల కుమారుడు అక్షిత్ ఆడుకుంటూ వెళ్లి పొరపాటున సల సల కాగుతున్న నీటిలో చేయి పెట్టాడు. తీవ్రంగా కాలడంతో అతని చేయి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సర్పంచ్ గణేశ్ విజ్ఞప్తితో పలువురు గిరిజన దాతలు కలిసి సుమారు రూ.1.37 లక్షలు వసూలు చేసి మెరుగైన వైద్యం చేయించి చిన్నారిని రక్షించారు.


