హత్నూర(సంగారెడ్డి): గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్ బ్యాటరీని ఎత్తుకెళ్లిన ఘటన హత్నూర మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వల్లిగారి దుర్గేశ్‌కు చెందిన ట్రాక్టర్ రోడ్డు పక్కన పెట్టాడు. రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్ బ్యాటరీని చోరీ చేశారు. సోమవారం ఉదయం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాళం వేసిన ఇంట్లో..
సిద్దిపేటరూరల్: తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని రాఘవాపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన ద్యావని వెంకటేశ్ ఇంట్లోకి రెండు నెలల క్రితం ఉడుము వచ్చింది. అపశకునంగా భావించిన అతడు అదే గ్రామంలో వేరే చోట కుటుంబంతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తన ఇల్లు చూసేందుకు వెళ్లగా.. ఇంటి తాళం పగులగొట్టి, బీరువా తలుపులు, లోపలి లాకర్ తెరిచి ఉన్నాయి. తులం బరువుగల రెండు బంగారు ఉంగరాలు, రూ. 50 వేల నగదు చోరీకి గురైంది. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో క్లూస్ టీం చేరుకుని వివరాలు సేకరించారు.
నిందితుడి రిమాండ్
పెద్దశంకరంపేట(మెదక్): పాతకక్షలను మనసులో పెట్టుకొని వ్యక్తిపై దాడి చేశాడు. ఈ సంఘటన మండల పరిధిలోని బూర్గుపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ.ప్రవీణ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాందేడ్ యాదయ్య గ్రామానికి చెందిన కలాలి లక్ష్మణ్‌గౌడ్‌పై పాతకక్షలను మనసులో పెట్టుకొని కల్లు దుకాణం వద్ద గొడ్డలితో దాడి చేయగా అతడు తప్పించుకున్నాడు. అనంతరం కల్లు సీసాతో పారిపోతున్న బాధితుడు లక్ష్మణ్‌గౌడ్‌ను గాయపర్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు యాదయ్యను అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేశారు.
మద్దూరు(హుస్నాబాద్): దూల్మిట్ట మండలంలో పని చేసే ఓ మహిళ అధికారిని వేధించిన ఘటనలో బైరాన్‌పల్లి గ్రామానికి చెందిన అనిల్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదైంది. ఎస్‌ఐ మహ్మద్ అసిఫ్ వివరాల ప్రకారం.. సదరు అధికారిని భయభ్రాంతులకు గురి చేసి పెళ్లి చేసుకోమని అనిల్ వేధించాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిపై పోలీసులు అట్రాసిటి కేసు నమోదు చే శారు.
దుబ్బాకరూరల్: పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మండలంలోని రాజక్కపేట గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ కీర్తిరాజ్ వివరాలు.. గ్రామ శివారులో కొంత మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు స్థావరంపై పోలీసులు దాడి చేశారు. రూ.8150 నగదు, 5సెల్ ఫోన్లు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకొని, 9మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
పాతదొమ్మాటలో ఇద్దరు..
చేర్యాల(సిద్దిపేట): పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాలు.. మండల పరిధిలోని పాతదొమ్మాటలో గ్రామ శివారు చెరువు సమీపంలో కొందరు పేకాట ఆడుతున్నారనే సమాచారం వచ్చింది. దీంతో పేకాట స్థావరంపై దాడి చేయగా ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా, ఐదుగురు పరారయ్యారు. రెండు ఫోన్లు, పేక ముక్కలు, రూ.2200 స్వాధీనం చేసుకున్నారు.
పటాన్‌చెరు టౌన్: మహిళ అదృశ్యమైన సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తంగి డివిజన్‌కు చెందిన తలారి మాధవి (20) సోమవారం ఉదయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికినా ఆచూకీ లభించలేదు.
పటాన్‌చెరు టౌన్: గుండెనొప్పితో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారానికి చెందిన గంగ మహేశ్(24) రెండేళ్గుగా గుండెనొప్పితో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నా.. ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ క్రమంలో సోమవారం గుండెనొప్పి తీవ్రత పెరగడంతో మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.


