● 15 మందికి గాయాలు
● ఇద్దరి విద్యార్థుల పరిస్థితి విషమం
రామాయంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో 12 మంది విద్యార్థులతోపాటు ఇద్దరు ఉపాధ్యాయులు, ఆటోడ్రైవర్ గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన రామాయంపేట శివారు జాతీయ రహదారిపై జంక్షన్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. స్కూల్ ముగియగానే స్థానిక తెలంగాణ మాడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు మొత్తం 16 మంది ఆటోలో రామాయంపేటకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆధ్యా హోటల్ జంక్షన్ వద్ద ఆటోను వెనుకనుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 12 మంది విద్యార్థులతోపాటు ఇద్దరు ఉపాధ్యాయులు, ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానిక సీఐ సైదా, ఎస్‌ఐ బాల్‌రాజ్ ,నార్సింగి ఎస్‌ఐ సృజన బాధితులను అంబులెన్సులో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలియగానే విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకొని విలపించారు. గాయపడ్డ వారిలో ఉపాధ్యాయులు జ్యోతి, మంజుల, విద్యార్థులు ఽశివచరణ్, ముఖేశ్‌గౌడ్, లావణ్య, అభిరాంగౌడ్, శ్రీతిక, దీక్షిత, శ్రావణ్, విశాల్, నవీన్, రక్షిత్‌రెడ్డి, రిషికేశ్‌గౌడ్, అభిజ్ఞ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కౌడిపల్లిలో ఇద్దరికీ గాయాలు
కౌడిపల్లి(నర్సాపూర్): రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల కేంద్రమైన కౌడిపల్లిలో 765డి జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ అమరేందర్‌రెడ్డి, స్థానికులు వివరాల ప్రకారం.. కౌడిపల్లి పీఎస్‌లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ శంకరయ్య, హోంగార్డ్ శంకర్ బైక్‌పై వెళ్తున్నారు. కాగా కౌడిపల్లి శివారులో రోడ్డు క్రాస్ చేస్తుండగా మెదక్‌వైపు నుంచి నర్సాపూర్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు ఎగిరి కిందపడ్డారు. హోంగార్డ్ శంకర్‌కు కాలు విరగగా, కానిస్టేబుల్ శంకరయ్యకు తల, భుజానికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను వెంటనే 108లో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


