● సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని దింపారని.. ● వట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌పై దాడి ● అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం
వట్‌పల్లి(అందోల్): యువకుడు ఆత్మహత్యకు పాల్పడగా.. తమకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని చెట్టు పైనుంచి దింపారని ఆరోపిస్తూ పోలీస్‌స్టేషన్‌పై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. మండల పరిధిలోని దరఖాస్తుపల్లి గ్రామానికి చెందిన బీరప్ప(22) వట్‌పల్లిలోని ఓ దాబాలో ఆరు నెలలుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి దాబాలోనే పడుకున్నాడు. శనివారం ఉదయం 8 గంటల సమయంలో దాబా నుంచి బయటకు వెళ్లి కొంత దూరంలో ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు. గమనించిన దాబా నిర్వాహకుడు శ్రీనివాస్ వెంటనే యువకుడి కుటుంబ సభ్యులతో పాటు స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. మృతుని కుటుంబీకులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని సదరు దాబా నిర్వాహకులే యువకుడి మృతికి కారణమని ఆరోపిస్తూ దాబా ఎదుట ఆందోళన చేపట్టారు. ఎస్‌ఐ లక్ష్మికాంతరెడ్డి , పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని దాబా నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యువకుడి మృతదేహాన్ని చెట్టు పైనుంచి కిందకు దింపారు.
పోలీస్‌స్టేషన్‌పై దాడి..
కాగా తమకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని కిందకు ఎలా దింపుతారని గ్రామస్తులు ఆగ్రహిస్తూ పోలీస్టేషన్‌పై దాడికి దిగి తలుపులు, అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చే క్రమంలో గ్రామానికి చెందిన బాబయ్య అనే వ్యక్తిపై ఎస్‌ఐ చేయి చేసుకోడంతోనే స్టేషన్‌పై దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. సమాచారం అందుకున్న జోగిపేట సీఐ అనీల్‌కుమార్ అదనపు బలగాలతో అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య యువకుడి మృతి, స్టేషన్‌పై జరిగిన దాడి ఘటనపై విచారణ చేపట్టారు. మృతుని అన్న నాగరాజు, గ్రామస్తుల సమక్షంలోనే మృతదేహాన్ని కిందకు దింపామని పోలీసులు తెలిపారు. కాగా మృతుని సెల్‌ఫోన్ ఆధారంగా ఆన్‌లైన్ యాప్‌లో బెట్టింగులకు పాల్పడినట్లు పేర్కొన్నారు.


