ఇద్దరు సీఐలపై బదిలీ వేటు | Sakshi
Sakshi News home page

ఇద్దరు సీఐలపై బదిలీ వేటు

Published Mon, Jan 1 2024 5:08 AM

- - Sakshi

రంగారెడ్డి: మొయినాబాద్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏవీ రంగాపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు సైబరాబాద్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ఐజీ ఆఫీస్‌లో రిపోట్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఐ ఏవీ రంగా మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆరు నెలలు కాకముందే బదిలీ కావడంపై స్థానికంగా సర్వత్రా చర్చనీయాశం అయింది. అవినీతి ఆరోపణలే ప్రధాన కారణమంటూ డిపార్ట్‌మెంట్‌లోనే జోరుగా ప్రచారం సాగుతోంది. 2023 జులై నెలలో ఐజీ ఆఫీస్‌ నుంచి సీఐ రంగా బదిలీపై మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అప్పటినుంచి ఆయన పనితీరు సరిగా లేదని.. ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతోపాటు.. మాట్లాడే విధానం సరిగా లేదని.. స్టేషన్‌కు వచ్చేవారిని సరిగా రిసీవ్‌ చేసుకోరనే విమర్శలు వ్యక్తమయ్యాయి.

దీనికి తోడు ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు చేసి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. పోలీసు ఉన్నతాధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండానే సుమారు 25 భూములకు సంబంధించిన కేసులను సెటిల్‌మెంట్‌ చేసినట్లు సమాచారం. హిమాయత్‌నగర్‌ రెవెన్యూలో భూ కబ్జాలతో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ఈ కేసులో పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించారని బాధితులు ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సదరు సీఐ రంగా ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించారనే ఆరోపణలున్నాయి. అవినీతి ఆరోపణల కారణంగానే ఉన్నతాధికారులు ఇన్‌స్పెక్టర్‌ ఏవీ రంగాపై బదిలీ వేటు వేసినట్లు ప్రచారం సాగుతోంది.

వాస్తుదోషం కలిసిరాలేదా..!
మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు జులై నెలలో బదిలీపై వచ్చిన ఏవీ రంగా పోలీస్‌స్టేషన్‌లో వాస్తుదోశాలను సరిచేసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు దక్షిణం వైపు ఉన్న ప్రధాన ద్వారం, గేటును మూసివేయించారు. తూర్పు వైపునకు రిసెప్షన్‌ను మార్చారు. ఇన్‌స్పెక్టర్‌ను కలవాలంటే రిసెప్షన్‌, ఏఎస్సైలు, ఎస్సైల క్యాబిన్లను దాటుకుంటూ ఇన్‌స్పెక్టర్‌ గదిలోకి వెళ్లే విధంగా మార్చేశారు. అంతకు ముందు ప్రధాన గేటుకు ఎదురుగానే రిసెప్షన్‌ ఉండేది. అక్కడి నుంచి ఇన్‌స్పెక్టర్‌ గదిలోకి వెళ్లే అవకాశం ఉండేది. కానీ ఏవీ రంగా వచ్చిన తరువాత పూర్తిగా మార్చేశారు. పోలీస్‌స్టేషన్‌కు వాస్తుదోషం ఉందని.. మార్పులు చేపట్టినా ఇన్‌స్పెక్టర్‌ ఏవీ రంగా ఇక్కడ ఆరు నెలలు కూడా పనిచేయకపోవడం శోచనీయం.

Advertisement
 
Advertisement